తెలంగాణలో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. మార్చి తొలి వారం నుంచే నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో కోతలు షురూ అయ్యాయి. రెండు, మూడో వారం నుంచి పూర్తిగా ఆ రెండు జిల్లాలతోపాటు నిర్మల్, జగిత్యాల, జనగామలో ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ రెండో వారంలో భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, వరంగల్, సిరిసిల్ల, ఖమ్మం, కొత్తగూడెం, నారాయణపేట జిల్లాల్లో మొదలవ్వగా, మిగతా జిల్లాల్లో మూడు, నాలుగో వారాల్లో కోతలు ఆరంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో యాసంగి(రబీ)లో 75.40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ కార్యాచరణ ప్రారంభించింది. జిల్లాలు, నెలల వారీగా కూడా అంచనాలు సిద్ధం చేసుకుని ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు మూడు నెలలపాటు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా మే నెలలో వడ్లు భారీ ఎత్తున వస్తాయని భావిస్తున్న అధికారులు.. మొత్తం లక్ష్యంలో సుమారు 57 శాతం ఈ ఒక్క నెలలో కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు.