TG Politics: మేడిగడ్డ ప్రాజెక్టు బయల్దేరిన BRS నేతలు

TG Politics: BRS leaders left for Medigadda project
TG Politics: BRS leaders left for Medigadda project

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపే ప్రభుత్వ యత్నాన్ని తిప్పికొడతామని చెబుతూ బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డ పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ నేతలు బయల్దేరారు. మొదటగా తెలంగాణ భవన్ చేరుకున్న నేతలు అక్కడ అల్పాహారం సేవించి బస్సుల్లో మేడిగడ్డకు బయల్దేరారు. కేసీఆర్‌ మినహా మిగతా బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు వెళ్తున్నారు. మేడిగడ్డ పరిశీలన తర్వాత అన్నారం బ్యారేజీ పరిశీలించనున్నారు. అన్నారం వద్ద పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి KTR, హరీశ్ రావు మాట్లాడతారు.

అయితే మేడిగడ్డ బయల్దేరే ముందు తెలంగాణ భవన్లో KTR, పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదని పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా కేసీఆర్ నిర్మించారని తెలిపారు. రాష్ట్రంలో కరువును పారద్రోలేలా కాళేశ్వరం నిర్మించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో జరిగినట్లు, లేనిది ఉన్నట్లు చూపుతోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు పోచారం.