భారత్ రాష్ట్ర సమితి రాజ్యసభ అభ్యర్థిని పార్టీ అధినేత KCR ఖరారు చేశారు. BRS రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరు ఖరారైంది. పార్టీ పెద్దలు, ముఖ్యులతో చర్చించిన అనంతరం KCR ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రవిచంద్రకు KCR బీఫారం కూడా అందించారు. వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
రవిచంద్ర రాజ్యసభ అవకాశం దక్కడం ఇది రెండోసారి. బండా ప్రకాష్ రాజీనామాతో 2022 లో వచ్చిన ఉపఎన్నికకు అభ్యర్థిగా అవకాశం కల్పించిన BRS, ఇప్పుడు మరోమారు అవకాశం ఇచ్చింది. రాజ్యసభ ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. BRS ఎంపీలైన వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్ల పదవీ కాలం ముగియడంతో వారి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.