కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఇటీవల ఆయన ఖమ్మం లోక్సభ టికెట్ను ఆశించారు. తనకు దక్కే అవకాశం లేదని సమాచారం అందడంతో అలకబూనారు. గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఇటీవల మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఎం, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్తో మాట్లాడారు. బుజ్జగింపుల తర్వాత బుధవారం వి.హనుమంతరావును సీఎం వద్దకు తీసుకెళ్లారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు. VHకు అన్ని విధాలా అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
లోక్సభ ఎన్నికలకు తెలంగాణలోని 17 నియోజకవర్గాలకుగాను ఇప్పటికే 9 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు. మిగిలిన 8 మందిని బుధవారం ఎంపిక చేయనుంది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశం బుధవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరగనుంది. దీనిలో సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, సీఈసీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పాల్గొననున్నారు.