BRS లోనే ఉంటాను.. నేను పార్టీ మారడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో BRS నుంచి బీజేపీ లోకి వలసలు పర్వం కొనసాగుతుంది. తాజాగా రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ హస్తం పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. కాగా.. ఎర్ర బెల్లి దయాకర్ రావు కూడా కషాయం కండువా కప్పుకుంటారని వార్తలు వచ్చాయి. వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రధాన అనుచరుడు.. అయితే ఈయన తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మార్నేని రవీందర్ రావు తోపాటు ఆయన భార్య, ఐనవోలు ఎంపీపీ మధుమతిలు BRSకు గుడ్ బై చెప్పారు. తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా BRS కు బై బై చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే పుకార్లపై ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. తాను పార్టీ మారడం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేశారు. నా పైన కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. BRS పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి KCR సారధ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పని చేస్తానని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్, పాలకుర్తి నియోజకవర్గంలో BRS పార్టీని బలహీనపర్చాలని ఇలాంటి దుష్ప్రచారం నాపై చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.