తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ సభలు, సమావేశాలు, ర్యాలీలతో బిజీబిజీగా గడుపుతున్నాయి. ముఖ్యంగా అందరికి కంటే ముందే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. వరుసగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తోంది.
ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు నియోజకవర్గాల వారీగా భేటీ అవుతూ పార్టీలో జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేటీఆర్ నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని.. పదేళ్ల తమ పాలనలో తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇక ఇప్పటికే ప్రచారంలో జోరు మీదున్న బీఆర్ఎస్ ఉగాది పండుగ తర్వాత మరింత ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 13వ తేదీన చేవెళ్ల వేదికగా జరగనున్న బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటారు. 15వ తేదీన మెదక్ లోనూ కేసీఆర్ సభ జరగనుంది.