Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినకు రాజయ్యాడు. ధర్మబద్ధంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు అందుకోసాగాడు.
కొన్నాళ్లకు ధర్మరాజు తీర్థయాత్ర చేయాలని భావించాడు. సోదరులను, సామంత రాజులకు తన మనోభీష్టాన్ని తెలిపాడు. వారిలో కొందరు ధర్మరాజుతో కలిసి యాత్ర చేయాలని నిశ్చయించుకున్నారు.
అదే సమయంలో ధర్మజుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్లి… ‘కృష్ణా! నేను, మరికొంత మంది తీర్థయాత్రలకు వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో వస్తే అంతకన్నా భాగ్యం మరొకటి ఉండదు’ అన్నాడు. యాత్రలు చేసే సమయం తనకు లేదన్నాడు కృష్ణుడు. ధర్మరాజు పట్టు వీడలేదు.
అప్పుడు కృష్ణుడు… ధర్మజుడికి ఒక సొరకాయను ఇచ్చి… ‘ధర్మరాజా! పనుల ఒత్తిడి వల్ల నీతో పాటు యాత్రలకు రాలేకపోతున్నాను.
నా ప్రతినిధిగా ఈ సొరకాయను నీ వెంబడి తీసుకుని వెళ్లు’ అని చెప్పాడు. కృష్ణుడి ఆదేశం ప్రకారం ధర్మరాజు… సొరకాయను నెత్తిన పెట్టుకుని యాత్రలకు వెళ్లాడు.
మూడు నెలల తర్వాత యాత్రలన్నీ పూర్తి చేసుకుని తిరిగి హస్తినకు చేరుకున్నాడు. మర్నాడు అన్న సమారాధన చేయాలని భావించాడు.
శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి… ‘కృష్ణా! మా యాత్ర విజయవంతంగా పూర్తయింది. నీవు ఇచ్చిన సొరకాయను నేను మునిగిన అన్ని తీర్థాల్లో ముంచాను. రేపు అన్న సమారాధన ఉంది. నీవు తప్పకుండా రావాల’ని కోరాడు.
అప్పుడు కృష్ణుడు… ‘ధర్మరాజా! అన్న సమారాధనలో ఈ సొరకాయను వండి అందరికీ ప్రసాదంగా పంచండి’ అన్నాడు. అలాగే చేశాడు ధర్మరాజు.
సొరకాయతో వండిన పదార్థం తిన్నవారంతా చేదు భరించలేక వాంతులు చేసుకున్నారు. ‘రాజా! చేదుగా ఉన్న సొరకాయతో ఎందుకు వంట చేయించారు’ అని ప్రశ్నించారు. కలత చెందిన ధర్మరాజు సమారాధనకు వచ్చిన కృష్ణుడితో… ‘స్వామీ! మీరిచ్చిన సొరకాయ చేదుగా ఉన్నది’ అన్నాడు.
కృష్ణుడు నవ్వి… ‘ధర్మరాజా! ఆ సొరకాయ చేదుగా ఉందని నాకు ముందే తెలుసు. నీతో పాటు ఎన్నో తీర్థాల్లో మునక వేసింది కదా..! దాని చేదుదనం పోయిందేమో అనుకున్నాను. ఇంకా అలాగే ఉన్నట్లుందే?’ అన్నాడు.
ధర్మరాజుకు విషయం అర్థమై… కృష్ణుడికి దండప్రణామాలు చేశాడు.
వేలమంది నిత్యం తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. జపతపాలు చేస్తున్నారు.
కానీ, మనసులో గూడు కట్టుకుని ఉన్న అసుర గుణాలు, పాప సంస్కారాల గురించి చింతించడం లేదు.
*హృదయ పరివర్తనం లేని యాత్రలు ఎన్ని చేసినా, తీర్థాల్లో ఎన్నిసార్లు మునిగినా ఫలితం ఉండదు
నాహమ్ వసామి వైకుంఠే
న యోగి హ్రుదయేషు చ ।
యత్ర మద్భక్తాః గాయన్తి
తత్ర తిష్టామి నారద !!