తెలంగాణ సీఎం కేసీఆర్ శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై ఎన్నికల కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందని ఎన్నికల కమిషన్ చీఫ్ ఓపీ రావత్ అభిప్రాయపడినట్టుగా జాతీయ మీడియా సంస్థ ఓ కథనంలో పేర్కొంది. ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్ వైఖరి స్వాగతించదగిన పరిణామం కాదని ఓపీ రావత్ చెప్పినట్టుగా ఆ కథనం పేర్కొంది. ప్రస్తుతం ఎన్నికల సంఘం ప్రతి మంగళ, శుక్రవారాల్లో సమావేశమై దేశంలో తాజా పరిస్థితులపై చర్చిస్తోంది. ఈరోజు జరిగిన సమావేశంలో తెలంగాణ ఎన్నికల నిర్వహణ అంశం చర్చకు వచ్చిందా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రావత్ తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
అయితే తెలంగాణలో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అసెంబ్లీ రద్దయ్యాక ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కాకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు జరుగుతాయని ఎవరో చెప్పిన జ్యోతిష్యంతో ఈసీకి సంబంధంలేదని కేసీఆర్ ను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.