తెలుగు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఆయనకు వ్యతిరేకంగా ఒక పత్రికలో పెద్ద ఎత్తున కథనం రావడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. మా కు సంబంధించిన నిధులన్ని కూడా ఆయన దోచేస్తూ ఉన్నాడని, అసలు మా కు సంబంధించిన పద్దుల్లో పలు లోటు పాటు ఉన్నాయి అంటూ సదరు కథనంలో పేర్కొనడం జరిగింది. దాంతో వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శివాజీ రాజా తనపై వస్తున్న ఆరోపణలను కొట్టి పారేశాడు. మీడియాలో తన గురించి తప్పుడు కథనం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ కథనం నిజం అని, తాను నిధులను దారి మల్లించినట్లుగా నిరూపిస్తే ఖచ్చితంగా పదవికి రాజీనామా చేసి గుండు కొట్టించుకుంటాను అంటూ సవాల్ విసిరాడు.
శివాజీ రాజాతో పాటు ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిధుల దారి మల్లింపులో శ్రీకాంత్ కూడా కీలక పాత్ర పోషించాడు అంటూ కొందరు చేస్తున్న విమర్శలను తాజాగా శ్రీకాంత్ మీడియా సమావేశంలో కొట్టి పారేశాడు. ఆర్థిక పరమైన అంశాలతో అసలు ఉపాధ్యక్షుడికి సంబంధం ఉండదనే విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. తన తప్పు నిరూపిస్తే ఏం చేసేందుకైనా సిద్దమే అంటూ ప్రకటించాడు. ఇక ఈ వివాదంకు కారణం సీనియర్ ఆర్టిస్టు నరేష్ అంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతుంది. నిధుల దుర్వినియోగం విషయంను మీడియాకు లీక్ చేసింది ఆయనే అని, ఆయన కారణంగానే ప్రస్తుతం మీడియాలో మా చులకన అయ్యింది అంటూ ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మీడియా సమావేశంకు నరేష్ రాకపోవడంకు కారణం అదే అంటూ సమాచారం అందుతుంది. అయితే ఈ విషయాన్ని కూడా శ్రీకాంత్ కొట్టి పారేశాడు. నరేష్ అలాంటి వ్యాఖ్యలు చేయడు అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.