కరోనా వైరస్ ఓ పక్క జనాలను నిద్రపట్టనీకుండా చేస్తుంటే.. మరోపక్క పశుపక్ష్యాదులు కూడా ప్రజలను అమితంగా భయపెడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో కాకులు నోటి నుంచి నురగ కక్కుకుంటూ చనిపోవడం కలకలం రేపుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో వరుసగా కాకులు చనిపోవడం కలకలంరేపుతోంది. స్థానికంగా పి.గన్నవరం మండలం నరేంద్రపురం శివారులోని బూరుగు గుంటలో రెండు రోజులుగా కాకులు మృత్యువాత పడుతున్నాయి.
అయితే కాకులకు నురగలు వచ్చి చనిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. అమలాపురం పశుసంవర్ధక శాఖ డీడీ ఏసురత్నం చనిపోయిన కాకులకు పోస్టుమార్టం నిర్వహించారు. పరిస్థితిని బట్టి కాకులను కాకినాడలోని డీఎల్‌డీఏ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేస్తామని తెలిపారు.
అయితే తమిళనాడులోని పనపాక్కంలో కూడా కాకులు అనుమానాస్పదంగా చనిపోవడం కలకలం సృష్టిస్తోంది. కానీ అక్కడ లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ఆహారం లభించక ఆ కాకులు చనిపోతున్నాయని అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కాకులు ఎక్కువగా చనిపోవడంతో పలురకాల అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.