డిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. దేశ రాజధాని మునిగిపోతుందా అని భయపడుతున్నారు.. యమునా నది మరింత ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఢిల్లీ వాసులు టెన్షన్ పడుతున్నారు.
ఎటువైపు నుంచి ముప్పు వస్తుందో అని గజగజ వణుకుతున్నారు. ఇప్పటికే అలర్ట్ అయిన కేజ్రీవాల్ ప్రభుత్వం.. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది. లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకే తరలిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ర్టాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హత్నికుంద్ బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నెల 18వ తేదీన దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో యమునా నది వరద తీవ్రత మరింత ఎక్కువైంది.
యమునా నది ప్రమాదకర హెచ్చరిక 204 మీటర్లు కాగా, డేంజర్ లెవల్ మార్క్ 204.50 మీటర్లు. డేంజర్ మార్కును కూడా దాటేసిన యమునా నది.. 204.7 మీటర్లకు చేరుకుంది. ఈ స్థాయి 207 మీటర్లకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
యమునా నది విజృంభిస్తుండటంతో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో సమావేశమై తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరానికి వరద ముప్పు పొంచి ఉందని ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 23 వేల 816 మందికి గానూ 2 వేల 120 క్యాంపులు ఏర్పాటు చేశారు అధికారులు.
ముందు జాగ్రత్తగా పాత ఢిల్లీలోని ఐరన్ బ్రిడ్జిపై అధికారులు రాకపోకలు నిలిపివేశారు. యుమునా నదిలో ప్రభుత్వం 53 బోట్లను సిద్ధం చేసింది. ఢిల్లీలో వరద పరిస్థితిని సీఎం కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అధికారులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు.