కొవిడ్-19 కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా మధ్యలో నిలిచిపోయిన పదో తరగతి పరీక్షల నిర్వహణ అంశంపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు నిత్యం సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఈనెల 30 వరకు లాక్డౌన్ కొనసాగుతుండగా.. ఆ తర్వాత లాక్డౌన్ ఉంటుందా? లేదా అన్న అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
అదేవిధంగా మరోపక్క కేంద్రం మే 3వరకు లాక్డౌన్ ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించినట్టు లాక్డౌన్ను సడలిస్తే మే మూడోవారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులంతా ఆన్లైన్ వీడియో పాఠాలు, దూరదర్శన్ యాదగిరి చానల్, టీసాట్, యూట్యూబ్ తదితర వాటి ద్వారా పరీక్షల కోసం సిద్ధం కావాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల బాగోగులు చూసుకోవాలని చెప్తున్నారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి నిర్ణయం రాకపోవడం విశేషం.