Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీహార్ పాలిటిక్స్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. బద్ధశత్రువులు మిత్రులైతే ఎలా ఉంటుందో లాలూ, నితీష్ ను చూస్తే తెలుస్తోంది. ఏదో ఓ సాకుతో లాలూకు దూరం జరగాలని నితీష్, ఎలాగైనా నితీష్ ను ఇబ్బంది పెట్టాలని లాలూ ఎత్తుకు పైఎథ్తులు వేసుకుంటూ వచ్చారు. ఇప్పటివరకూ లాలూ తనయుల్ని క్యాబినెట్లో భరించిన నితీష్ కు సీబీఐ దాడుల రూపంలో మంచి అవకాశం దొరికింది. వెంటనే లాలూ కుమారుడు తేజస్వి రాజీనామా చేయాలన్నట్లుగా సంకేతాలిస్తున్నారు.
ఇప్పటికే విపక్షాలన్నీ తేజస్విని రాజీనామా డిమాండ్ చేశాయి. అన్నివైపులా ఒత్తిడి పెరగడంతో ఆర్జేడీ కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో తేజస్వి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని లాలూనే తేల్చారట. దాంతో తేజస్వికి కాస్త ధైర్యం వచ్చింది. కానీ మర్నాడే కీలక మీటింగ్ పెట్టిన జేడీయూ మాత్రం ఆరోపణలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అసలే నోట్లో నాలుక లేని లాలూ కుమారుడు ఏం వివరణ ఇస్తారని ఆర్జేడీలో భయం మొదలైంది.
నితీష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని లాలూకు తెలిసినా.. ఆయన ఇప్పుడు నిస్సహాయుడు. ఉన్న అధికారం కూడా పోతే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని తెలుసు. అందుకే లాలూ అవసరాన్ని నితీష్ తెలివిగా వాడుకుంటున్నారు. ఇన్ డైరక్టుగా లాలూకు దూరం, ఎన్డీఏకు దగ్గర అని సంకేతాలిస్తున్నారు. ఈ లెక్కన నాలుగు రోజుల తర్వాత తేజస్వి రిజైనా చేయాల్సిందేనని నితీష్ ప్రెస్ మీట్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు రాజకీయ పండితులు.
మరిన్ని వార్తలు