తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార టిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. భువనగిరి నియోజకవర్గంలో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేనే తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఫైళ్ళ శేఖర్ రెడ్డి బిఆర్ఎస్ నుంచి మళ్ళీ బరిలో ఉంటున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. పార్టీలో ఉన్న నేతలకు టికెట్ ఇస్తారా?? లేక వేరే పార్టీ నుండి వచ్చిన నేతకు టికెట్ ఇస్తారా?? అని కాంగ్రెస్ నేతలందరూ అయోమయంలో ఉన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన అభ్యర్థికి టికెట్ ఉంటుంది అనే ప్రచారం కూడా వినిపిస్తోంది. భువనగిరి కాంగ్రెస్ శ్రేణులు పార్టీ కోసం ఎప్పటినుండో పనిచేస్తున్న నేతలకు టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. శివరాజ్ గౌడ్, పంజాల రామాంజనేయులు గౌడ్..ఇంకా కొంతమంది నేతలు తమకు ఈసారి అవకాశాన్ని కల్పించాలని కాంగ్రెస్ పెద్దలకు విన్నపాలు తెలుపుతున్నారు.
చింతల వెంకటేశ్వర రెడ్డి బిఆర్ఎస్ లో తనకు గుర్తింపు లేదని కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా బిజెపి నుండి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరికి టికెట్ ఇస్తుందా? లేక ఎప్పటినుంచో పార్టీలో ఉన్న నేతలలో ఒకరికి టికెట్ ఇస్తుందా అని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదే సమయంలో తాజాగా కోమటిరెడ్డిని జిట్టా కలిశారు. ఈ తరుణంలో సీటు అంశంపై ట్విస్ట్ కొనసాగుతుంది. ఇక ఈసారి భువనగిరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని దృఢ సంకల్పంతో ఉన్నామని అధిష్టానానికి భువనగిరి కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.. చివరికి సీటు ఎవరికి ఇస్తారో చూడాలి.