Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తిరుమలలో ఘనంగా ”తిరుమలనంబి తన్నీరు అముదు” ఉత్సవం శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు. శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీ వేంకటేశ్వరుని సేవలోనే తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన శ్రీ తిరుమలనంబి సేవల స్మృత్యర్థం ప్రతి ఏడాది నిర్వహించే తిరుమలనంబి ”తన్నీరముదు” ఉత్సవాన్ని తిరుమలలో గురువారంనాడు అత్యంత ఘనంగా నిర్వహించారు.
అధ్యయనోత్సవాలు గత ఏడాది డిసెంబర్ 18 తేదీన ప్రారంభమై గురువారం వరకు 25 రోజుల పాటు జరిగాయి.ఈ ఉత్సవాన్ని సాధారణంగా అధ్యయనోత్సవాల చివరి రోజున నిర్వహించడం ఆనవాయితి. గురువారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీమలయప్పస్వామివారు తిరుమాడ వీధి ఆలయ ప్రదక్షిణంగా వాహనమండపానికి వేంచేపు చేశారు.
తిరుమలనంబి ఆలయమునకు వీధి ప్రదక్షిణముగా ఆలయ మర్యాదలతో తిరుమలనంబి వంశీకులు శిరస్సుమీద ఆకాశగంగ తీర్థాన్ని బిందెలలో వాహనమండపానికి మోసుకువచ్చిన అనంతరం వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్ స్వాములు, ఆచార్య పురుషులు, ప్రబంధ గాయకులు, వైష్ణవులు, దేవస్థాన అధికారులు ఆలయంలోనికి పవిత్ర తీర్థ జలంతో వేంచేపు చేశారు.
అనంతరం తిరుమలనంబి వంశీకులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరిఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకించారు. ఈ సందర్భంగా వైదికులు తిరుమలనంబి రచించిన ”తిరుమొళి పాశురాలను” పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో జీయర్‌స్వాములు, తోళప్పచార్యుల వంశీకులు ఆలయ అర్చకులు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.