బిగ్‌బాస్ నుండి ఈ వారం ఎవరు ఊహించని విధంగా నందిని రాయ్ ఎలిమినేట్ అయ్యింది. సామాన్యుడి కోటాలో ఇంట్లోకి వెళ్లి ఆరు వారాలుగా ఎలిమినేషన్‌ను తప్పించుకుంటూ వస్తున్న గణేష్ ఈ వారం ఎలిమినేట్ అవ్వడం ఖాయం అని అంతా అనుకున్నారు. ఒకవేళ గణేష్ తప్పించుకుంటే రెండవ వ్యక్తిగా టీవీ9 దీప్తి ఉండవచ్చు అని అనుకున్నారు. కాని అనూహ్యంగా వీరిద్దరికి మద్దతుగా నిలిచిన ప్రేక్షకులు నందినికి ఓట్లు వేయలేదు. నందిని షో ప్రారంభం అయిన వారం రోజుల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోనికి వెళ్లింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ మొదట అంతా ఆమెను అంతా గేలి చేయడం జరిగింది. యాక్టివ్‌గా ఉండటం లేదని, గోడల్లో, సోఫాల్లో కలిసి పోతుందని నాని అనేవాడు. రెండు మూడు వారాల తర్వాత నందిని అన్ని టాస్క్‌లలో కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది.
నందిని మొదట కౌశల్‌తో స్నేహంగా మెలుగుతూ వచ్చింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయనతో గొడవ పడటం, సారీ చెప్పడం జరిగింది. గత వారంలో నందినికి మరియు కౌశల్‌కు తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. కౌశల్‌తో గొడవ పడ్డ వారు అంతా కూడా ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటూ మొదటి నుండి ప్రచారం జరుగుతూ వస్తుంది. తాజాగా నందిని విషయంలో కూడా అదే జరిగింది. కౌశల్‌తో ఎవరు పెట్టుకున్నా కూడా వారు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. కౌశల్‌ను వాడు, వీడు అంటూ దూషించిన కారణంగా నందినిపై ప్రేక్షకులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఆమెకు ప్రేక్షకులు మద్దతుగా నిలవలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నందిని రాయ్‌కి బిగ్‌బాస్‌తో వచ్చిన గుర్తింపుతో అప్పుడే ఒక చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. మరో రెండు చిత్రాలు కూడా ఆమెకు దక్కే అవకాశం ఉంది. నందిని ఎలిమినేట్ అయినా కూడా హ్యాపీగానే బయటకు వెళ్లింది.