తొలిప్రేమ… తెలుగు బులెట్ రివ్యూ

Tholi Prema Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  వరుణ్ తేజ్, రాశి ఖన్నా 
నిర్మాత:     బి. వి. ఎస్.ఎన్ ప్రసాద్ 
దర్శకత్వం :    అట్లూరి 
సినిమాటోగ్రఫీ:   జార్జ్ సి. విలియమ్స్ 
ఎడిటర్ :    నవీన్ నూలి 
మ్యూజిక్ :   తమన్ 

దాదాపు 20 ఏళ్ళ కిందట “తొలిప్రేమ “ సినిమా బాబాయ్ పవన్ కళ్యాణ్ కెరీర్ ని ఓ కొత్త మలుపు తిప్పింది. మళ్లీ ఇన్నేళ్లకు అబ్బాయి వరుణ్ తేజ్ అదే టైటిల్ తో సినిమా తీస్తున్నాడు అనగానే ఎన్నో సందేహాలు. ఆ టైటిల్ పెట్టుకుని అంచనాలు పెంచుకుని ఇబ్బందిపడడం ఎందుకని కొందరు, ఆ క్లాసిక్ పేరు చెడగొట్టడం ఎందుకని ఇంకొందరు కామెంట్ చేశారు. అయినా అదే తొలిప్రేమ తో ముందుకు వెళ్లిన చిత్ర యూనిట్ ఆ ప్రశ్నలకు తమ సినిమాతో ఎలాంటి సమాధానం ఇచ్చిందో చూద్దాం.

కధ…

ఓ రైలు ప్రయాణంలో ఆదిత్య ,వర్ష పరిచయం అవుతారు. చూడగానే కౌగిలించుకుని అందాన్ని పొగిడే చొరవ చేస్తాడు ఆదిత్య. వెంటనే ఎస్ అనకపోయినా వర్ష కూడా అతని ప్రేమలో పడుతుంది. ఆదిత్య కోసం అతను చేరిన కాలేజీ లో చేరుతుంది వర్ష. ఆ ఇద్దరు ప్రేమ లో మునిగితేలుతుండగా కాలేజీ లో జరిగిన ఓ గొడవతో ఇద్దరి మధ్య గొడవ వస్తుంది. ఆదిత్య ఆవేశం , వర్ష ఆలోచనకు మధ్య వచ్చిన తేడా తో ఇద్దరూ దూరం అవుతారు. అయితే చదువులు అయిపోయాక ఉద్యోగ రీత్యా వాళ్లిద్దరూ ఒకే చోటుకు చేరాల్సి వస్తుంది. అప్పుడు ఏమి జరుగుతుంది. గతాన్ని వదిలి వాళ్ళు తిరిగి ఒక్కటి అవుతారా లేక విడిపోతారా అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ…

20 ఏళ్ళ నాడు వచ్చిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తొలిప్రేమ లో కధానాయకుడు తన ప్రేమని హీరోయిన్ కి చెప్పడానికి నానా యాతన పడతాడు. నాటి కుర్రకారు సమాజంలో వున్న అప్పటి పరిస్థితులకు తగ్గట్టు ఆ హీరోలో చూసుకుంది. ఈ తొలిప్రేమ లో హీరో తొలిచూపులోనే ప్రేమలో పడడమే కాదు చెప్పేస్తాడు కూడా. అయితే అప్పుడు ప్రేమని వ్యక్తపరచడం , ఒప్పుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు వ్యక్తపరిచిన , ఓకే అయిన ప్రేమను నిలుపుకోవడం అంత కన్నా కష్టం అన్న పాయింట్ చుట్టూ మొదటి సినిమా కి దర్శకత్వం చేస్తున్న వెంకీ అట్లూరి కథ రాసుకున్నాడు. హీరో ఆవేశపరుడు , హీరోయిన్ ఆలోచన కలది అనగానే రొటీన్ సన్నివేశాలు చాలా సినిమాల్లో ఉన్నట్టు ఊహించుకుంటారు. కానీ డ్రామా కన్నా కాలేజీ టైం లో యువతీయువకుల్లో వుండే భావాలకు అద్దం పట్టేలా వెంకీ సీన్స్ రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయినప్పటికీ ఎక్కడా వినోదం పాళ్ళు తగ్గకుండా , అలాగని కధకు సంబంధం లేని అనవసర కామెడీ ఇరికించకుండా బాగా హేండిల్ చేసాడు. ఇలాంటి కథ , కధనంతో కొన్ని సినిమాలు వచ్చాయి అనిపించినా ప్రేక్షకుడు మనసు ఇంకోవైపు వెళ్లకుండా కట్టిపడేసాడు.

ఈ తరం యువతీయువకులు హీరో , హీరోయిన్స్ లో తమని తాము ఐడెంటిఫై చేసుకునేలా సన్నివేశాలు వున్నాయి. అయితే హీరో ,హీరోయిన్ క్లాష్ కి దారి తీసే సీన్ ఇంకా బలంగా రాసుకుని ఉండొచ్చు. కానీ ఆ వయసులో అలాంటి విషయాలకే ప్రేమని దూరం చేసుకుంటారు అని అనుకోవచ్చు. ఇక క్లయిమాక్స్ కూడా ఇంకాస్త లోతుగా రాసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అయితే ప్రేక్షకుడు అసంతృప్తికి లోను అవ్వడు. ఇక వెంకీ రాసిన కొన్ని డైలాగ్స్ గురించి చెప్పి తీరాలి. మంచివైనా, చెడ్డవైనా జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి .వాటిని మోసి తీరాల్సిందే అన్న డైలాగ్ తో పాటు కన్నతండ్రి ప్రేమ ని ఒప్పుకోకపోతే ఆ యువతి పడే బాధ , కులం గురించి రాసిన డైలాగ్స్ సైతం చప్పట్లు కొట్టించాయి.

ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కి దర్శకుడుతో పాటు హీరో , హీరోయిన్, సంగీత దర్శకుడు , కెమెరా మెన్ మూలస్థంభాల్లాంటి వాళ్ళు. నిజంగా హీరో వరుణ్ తేజ్ , హీరోయిన్ రాశిఖన్నా , మ్యూజిక్ డైరెక్టర్ థమన్ , కెమెరా మెన్ జార్జ్ విలియమ్స్ నిజంగా ఈ సినిమాకు మూలస్థంభాలుగా నిలిచారు. మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ ఈ సినిమాతో నటన పరంగా ఇంకో మెట్టు పైకి ఎక్కాడు. చిలిపి ప్రేమికుడిగా , ఆవేశపరుడైన యువకుడుగా , ప్రేమ భగ్నం అయిన కుర్రవాడిగా చాలా బాగా చేసాడు. సినిమాలో వరుణ్ ఎక్కడా కనిపించదు ఆదిత్య తప్ప. ఇక ఈ సినిమాలో తొలిసారి మెగా ఫామిలీ కి అసెట్ అయిన డాన్స్ ల విషయంలో కూడా వరుణ్ బాగా చేసాడు . ఇదే డైలాగ్ రాశిఖన్నా విషయంలో కూడా చెప్పుకోవాలి. వర్షగా రాశిఖన్నా సూపర్ . థమన్ , విల్లియమ్స్ తొలిప్రేమకు సంగీతం , కెమెరాతో ప్రాణ ప్రతిష్ట చేశారు. ఇక ప్రియదర్శి , హైపర్ అది , నరేష్ పాత్రలు వినోదం పండించాయి. భారీ సినిమాలు తీసే BVSN ప్రసాద్ నిర్మాతగా ఏ మాత్రం రాజీ పడకుండా తీసిన సినిమా ఇది.

తెలుగు బులెట్ పంచ్ లైన్… కాలం మారినా “తొలిప్రేమ “మధురమే.
తెలుగు బులెట్ రేటింగ్… 3.25/5 .