ద‌క్షిణాది రాష్ట్రాల‌కు దాదాపు రూ. 80వేల కోట్లు న‌ష్టం

Thomas Isaac comments on South states losses over 15th Finance Commission

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

15వ ఆర్థిక సంఘం నిబంధ‌న‌ల వ‌ల్ల ద‌క్షిణాది రాష్ట్రాల‌కు సుమారు రూ. 80వేల కోట్ల న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని కేర‌ళ ఆర్థిక‌మంత్రి థామ‌స్ ఇసాక్ హెచ్చ‌రించారు. 2011 జ‌నాభా లెక్క‌ల్ని ప్రాతిప‌దిక‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పాటు ఒడిశా, ప‌శ్చిమ‌బంగ లాంటి రాష్ట్రాల‌కూ న‌ష్టం వాటిల్లుతుంద‌ని… ఇది మొత్తం స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌కే దెబ్బ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 15 వ ఆర్థిక సంఘం నియ‌మ‌నిబంధ‌న‌ల‌పై మే 7వ‌తేదీన విజ‌య‌వాడ‌లో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల‌తో జ‌రిగే స‌మావేశం అజెండా ఖ‌రారు కోసం రాష్ట్రానికి వ‌చ్చిన థామ‌స్ ఇసాక్ అనేక అంశాల‌పై మాట్లాడారు.

15వ ఆర్థిక సంఘం నిబంధ‌న‌ల వ‌ల్ల చాలా రాష్ట్రాలు న‌ష్ట‌పోతాయ‌ని, అందుకే విజ‌య‌వాడ‌లో జ‌రిగే స‌మావేశం ఎంతో కీల‌క‌మైన‌దిగా భావిస్తున్నామ‌ని చెప్పారు. అన్ని రాష్ట్రాల‌ను ఏకం చేసేందుకు స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. త‌మిళ‌నాడు త‌ప్ప ఈ స‌ద‌స్సుకు అన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయ‌ని, నిధుల్లో వాటా త‌గ్గినా… ప్రోత్సాహ‌కాలు ఇస్తామ‌ని, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాన్ని ప్ర‌ధాని త‌ప్పుదారి ప‌ట్టించార‌ని ఆరోపించారు. రాష్ట్రాల‌కు జ‌రిగే అన్యాయంపై క‌ర్నాట‌క ఎన్నిక‌ల‌తో పాటు వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చ‌ర్చ జ‌ర‌గాల‌ని అభిప్రాయ‌పడ్డారు. విజ‌య‌వాడ సద‌స్సు త‌ర్వాత ప్ర‌జ‌ల్లోకి వెళ్లి దీనిపై వివ‌రిస్తామ‌ని చెప్పారు. జీఎస్టీలోనూ రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని తొలుత జీఎస్టీ రెవెన్యూలో 60 శాతం రాష్ట్రాల‌కు ఇవ్వాల‌నే ఆలోచ‌న ఉండేద‌ని, కానీదాన్ని 50 శాతానికే ప‌రిమితం చేశార‌ని థామ‌స్ మండిప‌డ్డారు.