దూకుడు పెంచిన పవన్…మాజీ ఐఏఎస్ కు కీలక పదవి…!

Thota Chandrasekhar Appointed As Janasena General Secretary

సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. పార్టీలోని వివిధ పదవులను భర్తీ చేస్తూ జోరుమీదున్నారు. పార్టీ పదవులను భర్తీ చేస్తూ, పార్లమెంటరీ కమిటీలను ఏర్పాటు చేస్తూ జనసేన ముందుకెళ్తోంది. ఇప్పటికే వివిధ పార్లమెంటరీ కమిటీలను ఏర్పాటు చేసిన పవన్ తాజాగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తోట చంద్రశేఖర్‌తో తనకు పదేళ్లుగా సాన్నిహిత్యం ఉందని పవన్ ఈ సందర్భంగా తెలిపారు. సర్వీస్ ఉండగానే 2009లో ఐఏఎస్‌కు రాజానామా చేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చారని జనసేనాని చెప్పారు. తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ 1987లో సివిల్స్‌కు సెలక్టయ్యాక అపాయింట్‌మెంట్ లెటర్ తీసుకున్నప్పుడు ఎంత ఆనందించానో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఆనందం కలుగుతోందన్నారు.

ప్రతి రోజూ రాత్రి రెండు, మూడు గంటల వరకు పని చేసినా పవన్ ముఖంలో అలసట కనిపించడం లేదు, మేం మాత్రం అలిసిపోతున్నామని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పి.హరిప్రసాద్‌ను పవన్ రాజకీయ కార్యదర్శిగా మరోసారి ఎంపిక చేశారు. జ‌న‌సేన ‘ప్రెసిడెంట్స్ సోష‌ల్ వెల్ఫేర్ ప్రోగ్రాం’ చైర్మన్‌గా రాధా మాధవ్‌ను నియమించారు. అయితే రెండుసార్లు లోక్‌సభకు పోటీ చేసిన తోట చంద్రశేఖర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం చాలా సంతోషకరమని ప్రకటనలో పవన్ పేర్కొన్నారు. ఆయన మంచి పరిపాలకుడే కాకుండా విజయవంతమైన పారిశ్రామికవేత్త అని పవన్ తెలిపారు. పౌర పరిపాలనలో ఆయనకున్న పట్టు, శక్తి సామర్థ్యాలు అపారమైనవన్నారు. ఆయన దీక్షాదక్షత జనసేన పార్టీని మరింత విస్తృతపరచడానికి ఉపయోగపడుతుందని తాను, జనసేన పార్టీ ముఖ్యమైన ప్రతినిధులు గట్టిగా విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.