ఎట్టకేలకి వీడిన కడప పంచాయతీ…!

YS Jagan Do Not Care About What Locals Want Minister Adinarayana Reddy Fires On Ysrcp Boss

ఎన్నికల ముందు కడప జిల్లాలో టీడీపీకి పెద్ద బూస్ట్ లాంటి వార్తా ఇది. జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డిని చంద్రబాబు ఖరారు చేశారు. 30 ఏళ్లపాటు ప్రత్యర్థులుగా ఉన్న రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి మధ్య రాజీ కుదర్చడంలో విజయం సాధించిన బాబు ఎట్టకేలకు ఆ పంచాయతీ తెగగొట్టారు. ప్రత్యర్థులుగా తలపడిన ఇద్దరూ కలిసిపోవడంతో జమ్మలమడుగులో ఆధిపత్య పోరుకు తెరపడింది. ఎమ్మెల్యే టికెట్ ఖాయం చేసుకున్న రామసుబ్బా రెడ్డి బదులుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖను చంద్రబాబుకు పంపించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి టీడీపీ తరఫున పోటీ చేయగా ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ఆయన రాకను రామసుబ్బారెడ్డి వర్గం వ్యతిరేకించింది.

కానీ ఆయన్ను ఒప్పించిన బాబు ఇప్పుడు వీరిద్దరి మధ్య అసెంబ్లీ స్థానం వివాదంలో రాజీ కుదిర్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు మంత్రి పదవి ఇచ్చినందున ఆ గౌరవంతో ఎంపీగా పోటీ చేయడానికి ఆదినారాయణ రెడ్డి అంగీకరించారు. కానీ రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించాలనే నిబంధన విధించారు. రామసుబ్బారెడ్డిని ఒప్పించడంతో పాటు ఎంపీగా పోటీ చేస్తే అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఆదినారాయణ రెడ్డికి బాబు హామీ ఇచ్చారు. దీంతో కడప నుంచి ఆదినారాయణ రెడ్డి ఎంపీగా పోటీ చేయనున్నారు. ఆయన ఆర్ధికంగా బలవంతుడు కాబట్టి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి ఇది కలిసొచ్చే అవకాశం ఉంది.