Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తిరుమల వెంకన్న ప్రపంచంలోనే సంపన్నమైన దేవుడు. కానీ గత ఏడాది ఎప్పుడూ లేని విధంగా టీటీడీ డిపాజిట్ల సొమ్ము తీసి మరీ వాడుకోవడంతో… ఆదాయం తగ్గిందనే ప్రచారం మొదలైంది. టీటీడీకి ఎప్పుడూ కాసులు కురిపించే కల్పతరువు వీఐపీ బ్రేక్ దర్శనమే. కానీ గత కొంతకాలంగా సామాన్య భక్తుల కోసం ఆ దర్శనం రద్దు కావడంతో ఆదాయం తగ్గిపోతోందని అధికారులు లెక్క తేల్చారు.
సామాన్య భక్తులు ఎంతమంది వచ్చినా… వచ్చే డబ్బులు అంతంతమాత్రమే. సామాన్యులు ఎవరూ హుండీలో ఎక్కువ కానుకలు వేసే పరిస్థితి ఉండదు. కానీ ఉదయం గంటపాటు జరిగే వీఐపీ బ్రేక్ దర్శనంలో మాత్రం కాసుల వరద కురుస్తుంది. కానీ కొంతకాలంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. కానీ నిధుల కటకటకు అది మాత్రమే కారణం కాదని… టీటీడీ స్వయంకృతాలే చాలా ఉన్నాయని భక్తులంటున్నారు.
వీఐపీలు హుండీలో డబ్బులు వేయనంత మాత్రాన స్వామి పేదవారైపోరని, కొంతమంది ప్రముఖులతో కుమ్మక్కైన అధికారులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. టీటీడీ బడ్జెట్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల బడ్జెట్ కంటే వేగంగా పెరుగుతోందని, అసలు అన్ని నిధులు ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు. భక్తులకు కల్పించే సౌకర్యాల్లో ఏమాత్రం మెరుగుదల లేదని, మరి నిధులన్నీ టీటీడీ సభ్యుల జేబులోకి వెళ్తున్నాయా అని ప్రశ్నిస్తున్నారు.