Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్ష పదవికి ప్రొఫెసర్ కోదండరామ్ రాజీనామా చేయనున్నారు. ఆయన అధ్యక్షతన టీజేఏసీ తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది. ఊరూవాడా ఏకం చేసి పోరాటంలో కదం తొక్కించి…. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన టీజేఏసీ…. తెలంగాణ ఏర్పాటు తర్వాత మాత్రం నామమాత్రంగా మిగిలిపోయింది. రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలో టీజేఏసీ అధ్యక్షుడిగా కోదండరామ్ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో బలమైన టీఆర్ ఎస్ ను రాజకీయాల ద్వారానే ఎదుర్కోవాలని నిర్ణయించిన కోదండరామ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు.
తెలంగాణ జనసమితి పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. దీంతో టీజేఏసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద రాజీనామా చేయనున్నట్టు కోదండరామ్ చెప్పారు. రేపు సరూర్ నగర్ మైదానంలో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభలోనే కొత్త పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు సహా ప్రతిపక్షాలన్నీ బలహీనంగా ఉన్న తెలంగాణలో టీఆర్ ఎస్ ను ఎదర్కొనే దీటైన శక్తిగా తెలంగాణ జనసమితిని తీర్చిదిద్దాలని కోదండరామ్ భావిస్తున్నారు.