రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున ఆ కూటమిలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం అభ్యర్థిగా జనగామ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని ఎన్నో ఊహాగానాలు వచ్చినా, వాటికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ కి చెందిన పొన్నాల లక్ష్మయ్య ని జనగామ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ముందునుండి జనగామ అనేది పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గం అయినప్పటికీ మహాకూటమి ని పరిగణలోకి తీసుకొని కోదండరాం డిమాండ్ మేరకు ఈ సీటు అతనికే కేటాయిస్తారని అనుకున్నా, అందరూ మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీ కే కేటాయించి, చివరకు కోదండరాం సారు కి మొండి చెయ్యి చూపించారు.
ఈ విషయం పైన కోదండరాం మాట్లాడుతూ, తొలుత మహాకూటమి తెలంగాణ జన సమితి కి 8 సీట్లు కేటాయిస్తామని అధికారికంగా ప్రకటించినా, చివరికి 6 సీట్లతో మేము సర్దుకోవాల్సి వచ్చిందన్నారు. ముస్లింలకు ఒక్క సీటు అయినా కేటాయించాలనుకున్నామని, కానీ ఇచ్చినవి తక్కువ సీట్లు అవ్వడంతో పాటు, చివరిలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యపడలేదన్నారు. సీట్ల సర్దుబాటు లో తాము నిరాశగా ఉన్న మాట వాస్తవమేనని, మా అభ్యర్థులు బరిలో దిగినచోట, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్నేహపూర్వకంగా ఉపసంహరణ చేసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. మొదటినుండి తాను జనగామ నియోజకవర్గం అభ్యర్థిగా బరిలోకి దిగి, గెలుపొందాలని అనుకున్నానని, కానీ బీసీల కోసం జనగామ స్థానాన్ని తాను వదులుకోవాల్సి వచ్చిందని, ఇరకాటంలో పడే పరిస్థితులు ఏమి లేకుంటే జనగామ సీటు తనకే కేటాయించాల్సిందిగా కోరానని, కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సీటు తాను వదులుకోవాల్సి వచ్చిందని కోదండరాం వివరించారు. వరంగల్ ఈస్ట్, మిర్యాలగూడ, మహబూబ్ నగర్ సీట్లు తమకి కావాలని అడిగినట్లు చెప్పగా, అనూహ్యంగా బీసీ నేత ఆర్. కృష్ణయ్య కి మిర్యాలగూడ సీటు కేటాయించడం తాను అస్సలు ఊహించలేదని ఆశ్చర్యం ప్రకటించారు.