ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అరుదుగా కనిపించినా మనసుకు హత్తుకునేలా అనిపిస్తాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ తల్లిదండ్రుల తర్వాత మూడో దైవం గురువే. విద్యాబుద్దులు నేర్పే గురువుకి అంతటి గొప్ప స్థానం ఇచ్చారు మన పూర్వీకులు. అమ్మ నాన్న పేగు బంధంతోనో, రక్త బంధంతోనో మనకు ఎక్కువ అయితే అవేమీ లేని మూడో పేరంట్ మన గురువు. తమకు విద్యాబుద్ధులు, మంచి నడవడిక నేర్పించే ఉపాధ్యాయుడిని పిల్లలు ప్రేమిస్తారు. తమ తల్లిదండ్రుల లాగా భావించి గౌరవిస్తారు. దీనికి ఉదాహరణే ఈ సంఘటన. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా వెలియాగరంలో ఉన్న గవర్నమెంట్ హైస్కూల్ లో 28 ఏళ్ల జి. భగవాన్ ఇంగ్లిష్ టీచర్ గా పనిచేస్తున్నారు. ఆయనను తిరుత్తణి సమీపంలోని అరుంగులం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు అధికారులు.
సాధారణంగా పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే చదువుకోమని చెప్పి ఇబ్బంది పెట్టె ఉపాధ్యాయులు ఈరోజు స్కూల్ కి రాపోతే బాగుండు అనుకుంటారు. ఏదయినా అనారోగ్యం వచ్చి ఆయన స్కూల్ కి రాకుండా ఉండాలి అని భగవంతున్ని సైతం వేడుకుంటారు అలాంటి పిల్లలు తమ టీచర్ మరో ఊరికి బదిలీ అయ్యారని తెలిసి పిల్లలంతా తమను విడిచి వెళ్లొద్దని ఆయనను కాళ్లావేళ్లా పడి బతిమాలారు. కన్నీరు పెట్టుకున్నారు. మానవహారంగా నిలబడి అడ్డుకోబోయారు. ఒక విద్యార్థి అయితే ఉద్వేగంతో ఆయనను వెనక నుంచి గట్టిగా కౌగిలించుకొని విడిచిపెట్టేదే లేదని విలపించాడు. భగవాన్ టీచర్ ట్రాన్స్ ఫర్ ఆపకపోతే తరగతులకు రాకుండా స్కూల్ బయట నిరసన ప్రదర్శన జరుపుతామని హెచ్చరించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు మద్దతు తెలిపారు. ఎందుకంటారా ఆ టీచర్ అందరి టీచర్ల లాగానే నాలుగు రాళ్ళూ వెనకేసుకుందామని పనిచేయలేదు. విద్యార్థులకు నాలుగు పాఠాలు, ఏవో నీతిసూత్రాలు చెప్పేసి గంట కొట్టగానే ఇంటికేల్లిపోవడం తన విధి అనుకోలేదు.
పాఠ్యాంశాలతో సంబంధం లేకుండా వారికి ఆధునిక ప్రపంచం గురించి వివరించాడు. కొత్తకొత్త పద్ధతుల్లో ఆసక్తికర బోధన చేశాడు. ఈ లోకంతో పోటీ పడ్డం ఎలాగో నేర్పాడు. అన్నింటికీ మించి వారిని తన సొంత తమ్ముళ్లలా, చెల్లెళ్లలా భావించాడు. అందుకే విద్యార్థులు అతణ్ని టీచర్ అని కాకుండా తమ స్నేహితుడిగా, సోదరుడిగా భావించారు. అతడు బదిలీపై వెళ్తోంటే కన్నీరుమున్నీరై అడ్డుపడ్డారు. విద్యార్థులతో అంతే అనుబంధం పెనవేసుకున్న ఆ టీచర్ కూడా తన మీద తన విద్యార్ధులు చూపుతున్న ప్రేమాభిమానాలకు కరిగి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. తమిళ మీడియాలో ప్రముఖంగా వచ్చిన ఈ వార్త అధికారులను సైతం కదిలించింది. వారు భగవాన్ బదిలీ ఉత్తర్వులను 10 రోజుల పాటు నిలిపేశారు. ఆయనను ఎక్కడ నియమించేది త్వరలోనే నిర్ణయిస్తామని ప్రకటించారు. నిజమే కొన్ని వృత్తులని ఒక ఉద్యోగంలా చేయకూడదు అందుకే స్కూలుకొక్క భగవాన్ కావాలి అనిపిస్తుంది.