Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో బల్బ్ వెలిగినట్టు ఇప్పుడు సాగుతున్న ఓ వర్తమాన పరిణామం అనేక కీలక మలుపులకి కేంద్ర బిందువు కానుంది. ఆ పరిణామం మరేదో కాదు తెలంగాణాలో డ్రగ్స్ కేసు విచారణ. దీంతో టాలీవుడ్ లో కలవరం మొదలైంది. ఎప్పుడు ఏ పేరు బయటికి వస్తుందో అని వణికిపోతున్న టాలీవుడ్ లో కొందరు అకున్ సబర్వాల్ ని హీరోగా, ఇంకొందరు విలన్ గా చూస్తున్నారు. మొత్తం మీద అకున్ సబర్వాల్ ఎఫెక్టివ్ పని తీరు చూసి తెలంగాణ సీఎం కెసిఆర్ కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఎక్కువగా సంతోషపడుతోందట. లోలోపల టాలీవుడ్ ని వణికిస్తున్న అకున్ సబర్వాల్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటోందట. అందుకు కారణం తెలిస్తే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది.
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన నాటి పరిస్థితుల్ని తల్చుకుని టాలీవుడ్ పెద్దలు ఏపీ కి వెళ్ళిపోతారని అప్పట్లో ఓ ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారం ప్రచారంగానే మిగిలిపోయింది. టాలీవుడ్ హైదరాబాద్ నుంచి ఇంచ్ కూడా కదల్లేదు. ఒకప్పుడు కెసిఆర్ ని తిట్టిన సినీపెద్దలే అవకాశం కలగజేసుకుని మరీ ఆయన్ని పొగడ్డం పనిగా పెట్టుకున్నారు. కెసిఆర్ ప్రాపకం కోసం పనిలో పనిగా బాబు మీద చెణుకులు వేశారు. ఈ పరిస్థితుల్లో చిత్రసీమని ఆంధ్రప్రదేశ్ కి రప్పించడం ఏపీ సర్కార్ కి పెద్ద సవాల్ గా మారింది. ఏపీ ప్రభుత్వం ఎంత పిలిచినా పట్టించుకోని టాలీవుడ్ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు ఇప్పుడు అకున్ సబర్వాల్ దెబ్బకి రూట్ మార్చేసుకునే ఆలోచన చేస్తున్నారట. ఏ మాత్రం అవకాశం దొరికినా విశాఖ లేదా అమరావతికి చెక్కేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. కొందరు సినీ పెద్దలు ఈ విషయాన్ని ఏపీ సర్కార్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఓ పెద్దాయన ఆ అకున్ సబర్వాల్ కి థాంక్స్ చెప్పాలి అని రెస్పాండ్ అయ్యాడట. డ్రగ్స్ కేసు వల్ల అయినా ఆంధ్ర మీద చిత్రసీమ కన్ను పడేట్టు చేసిన సబర్వాల్ కి థాంక్స్ చెబితే తప్పేంటన్న వాదన కి బాగానే మద్దతు లభిస్తోంది.
మరిన్ని వార్తలు