దాదాపు వంద చిత్రాలకు పాటలను అందించి, కొన్ని సినిమాలకు డైలాగ్స్ రాసి, ఒక సినిమాకు దర్శకత్వం కూడా చేసిన కులశేఖర్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కులశేఖర్ ఇండస్ట్రీలో ఉన్న సమయంలోనే తప్పుడు స్నేహాలు, చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. ఆ సమయంలోనే కులశేఖర్‌కు తీవ్రమైన అనారోగ్యం ఏర్పడినది. దాంతో ఆయన్ను కుటుంబ సభ్యులు విశాఖపట్నం తీసుకు వెళ్లి చికిత్స అందించారు. ఆ సమయంలో ఆయన మానసిక పరిస్థితి చెడిపోయిందనే వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల చికిత్స అనంతరం కులశేఖర్ తిరిగి మామూలు మనిషి అయ్యాడు.
మళ్లీ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం హైదరాబాద్ చేరుకున్న కులశేఖర్ చాలా ప్రయత్నించాడు. కాని ఏ ఒక్కరు కూడా ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో మళ్లీ ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. పలు రకాలుగా ఆయన సినిమా ప్రయత్నాలు చేసినా కూడా విఫలం అవ్వడంతో మానసికంగా కృంగి పోయాడు. దాంతో మళ్లీ మతి భ్రమించడంతో ఆయన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అక్కడ నుండి బయటకు వచ్చిన కులశేఖర్ దొంగతనాలకు పాల్పడ్డాడు. బ్రహ్మణ సమాజంపై ఆయనకు కోపం ఉందంటూ వస్తున్న వార్తలు నిజం కాదు. కేవలం ఆయన మతి భ్రమించడం వల్లే దొంగతనాలు చేస్తున్నాడు. ఆయన్ను కుటుంబం పట్టించుకోవడం లేదు అనే వార్తలు కూడా నిజం కాదట. ఆయన్ను కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంటూ, ఆయన్ను కాసుకుంటూనే ఉంది. ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో ఉన్న కులశేఖర్ మానసిక వైధ్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నాడు. ఆయన గురించి మీడియాలో వస్తున్న రకరకాల పుకార్లకు ఆయన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.