బాలీవుడ్ లో మరో హిట్ పెయిర్ పెళ్లిపీటలెక్కనున్నట్టు తెలుస్తోంది. ఐదేళ్ల నుంచి ప్రేమలో మునిగితేలుతున్న దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్ త్వరలోనే వివాహంతో ఒక్కటి కానున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది. రేపు శ్రీలంకలో నిశ్చితార్థం జరగనున్నట్టు సమాచారం. రేపు దీపిక పుట్టినరోజు కూడా. న్యూ ఇయర్ వేడుకలకు మాల్దీవులకు వెళ్లిన దీపిక, రణ్ వీర్ లు అక్కడి నుంచి ఇరువురి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీలంక వెళ్లనున్నారు. నిశ్చితార్ధం తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా కొద్ది రోజుల్లోనే పెళ్లి వేడుక కూడా జరగనున్నట్టు తెలుస్తోంది. రణ్ వీర్, దీపిక కలిసి నటించిన పద్మావతి ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా రిలీజ్ కు ముందే వారి పెళ్లిజరిగే అవకాశం కనిపిస్తోంది.
సంజయ్ లీలా భన్సాలీ రామ్ లీలా సినిమాలో తొలిసారి కలిసి నటించిన రణ్ వీర్, దీపిక ఆ మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. రామ్ లీలా తర్వాత బాజీరావ్ మస్తానీ, పద్మావతి చిత్రాల్లో కలిసి నటించడంతో వారిద్దరి బంధం మరింత బలపడింది. అయితే రణ్ వీర్ కంటే ముందు దీపిక కు కొన్ని ప్రేమకథలున్నాయి.
బాలీవుడ్ కు పరిచయమైన కొత్తలోనే క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కలిపి ఆమె పేరు వినిపించింది. అయితే వారి పరిచయం ప్రేమదాకా వెళ్లకుండానే ముగిసిపోయింది. తర్వాత రణ్ బీర్ కపూర్ తో ప్రేమలో పడింది దీపిక. ఆమె నటించిన ఓం శాంతి ఓం, సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో వచ్చిన రణ్ బీర్ తొలిచిత్రం సావరియా ఒకే రోజు విడుదలయ్యాయి. పోటాపోటీ చిత్రాల హీరో హీరోయిన్లు విచిత్రంగా తర్వాతి రోజుల్లో ప్రేమలో పడ్డారు. వారి ప్రేమకు కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆమోదం లభించింది. కానీ ఏ కారణాల వల్లో వారిద్దరూ విడిపోయారు. రణ్ బీర్ కత్రినాకైఫ్ కు దగ్గరవడం వల్లే ఆ ప్రేమ విఫలమయిందని అంతా భావించారు.
అనుకున్నట్టుగానే దీపిక నుంచి విడిపోయిన తరువాత రణ్ బీర్ కత్రినాకైఫ్ మధ్య చాలా ఏళ్లపాటు ప్రేమాయణం నడిచింది. రణ్ బీర్ తర్వాత దీపిక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యజమాని, విజయ్ మాల్య కొడుకు సిద్దార్ధ మాల్యతో ప్రేమలో పడింది. రాయల్ చాలెంజర్స్ జట్టు గెలిచిన సందర్భాల్లో సిద్దార్ధ, దీపికను బహిరంగంగానే ముద్దుపెట్టుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ ప్రేమకథ కూడా ముగిసిపోయింది. కొన్నాళ్లకు బాలీవుడ్ లో బిజీతారగా మారిపోయింది దీపిక. ఆ క్రమంలోనే రామ్ లీలా సమయంలో రణ్ వీర్ తో ప్రేమలో పడింది. అయితే ఈ ప్రేమ పెళ్లిదాకా వస్తుందని ఎక్కువమంది నమ్మలేదు. దీపిక గత ప్రేమాయణాల లానే ఇదీ ముగిసిపోతుందేమోనన్న సందేహాలు తలెత్తాయి. అయితే ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ…రణ్ వీర్ తో జీవితం పంచుకునేందుకు సిద్ధమయింది . బాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా వెలుగొందుతూ…వరుస అవకాశాలను చేజిక్కించుకుంటున్న దీపిక పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.