విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మికను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘దొరసాని’. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పిస్తున్న ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈనెల 12న ‘దొరసాని’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదే ఈ డైరెక్టర్ కి తొలి సినిమా. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ విడుదలయ్యాయి. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చి్ంది. కానీ ఈరోజు విడుదలైన ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాపై ప్రతి ఒక్కరికి ఆసక్తి పెరుగుతుంది. పక్కా తెలంగాణ యాసలో డైలాగులు, దొరసాని ఇంటికొచ్చిన ఆనంద్ దేవరకొండకు ఆమె చెంబుతో తాగడానికి నీళ్లు ఇస్తుంది. ఆ చెంబు పట్టుకుని ‘మేం తాగొచ్చా’ అని ఆనంద్ అడగడం వెంటనే దొరసాని అతనికి ముద్దు పెట్టడం, ఈ ఎమోషనల్ సీన్ ట్రైలర్ కే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో హీరో జైలుకు వెళ్తాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. జైలులో ఉన్న సమయంలో అతనికి ఒక ఉద్యమకారుడు తగులుతాడు. ‘ఉద్యమంలో చావు కూడా ఒక విజయమే’ అని ఆ ఉద్యమకారుడు అనగానే ‘నా ప్రేమ కూడా ఒక ఉద్యమమే’ అని అంటాడు హీరో. ఆనంద్ దేవరకొండ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. మొత్తం మీద ట్రైలర్ చూస్తుంటే సినిమా హిట్టుకొట్టేలానే కనిపిస్తోంది.