తమిళనాడులోని చెన్నై సమీపంలోని మధురై రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న పర్యటక రైలులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. దాదాపు 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. రైల్వే అధికారులకు ఈ ప్రమాదంపై సమాచారం అందగానే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
దక్షిణాదిలో ఆధ్యాత్మిక దర్శనం కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ నుంచి ఆగస్టు 17న ఓ టూరిస్ట్ రైలు బయలుదేరింది. అందులో 60 మందికి పైగా యాత్రికులు తమిళనాడు నాగర్‌కోయిల్‌లోని పద్మనాభ స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని శనివారం తెల్లవారుజామున రైలులో ముధురై చేరుకున్నారు. ఆ రైలు.. మధురై రైల్వే స్టేషన్‌కు ఒక కిలో మీటరు దూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలో తమతో పాటు తెచ్చుకున్న సిలిండర్‌ను ఉపయోగించి టీ తయారు చేసుకుందామనుకున్నారు.
టీ చేసుకునే ప్రయత్నంలో సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఆ మంటలు రెండు కోచ్‌లకు వ్యాపించాయి. కొంతమంది ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగగా.. మరికొందరు అందులోనే చిక్కుకుపోయి మరణించారు.