హిమాచల్ ప్రదేశ్‌లో పర్వతారోహణకు వెళ్లి కనిపించకుండా పోయిన బృందంలో ఇప్పటివరకు ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఇద్దరిని అధికారులు రక్షించారు. మరో ఇద్దరి అచూకీ కనిపెట్టేందుకు హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీకి చెందిన 8 మంది పర్వతారోహకులతోపాటు ముగ్గురు వంటవాళ్లు ట్రెక్కింగ్ కోసం ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చారు.
11న ఉత్తరకాశి జిల్లాలోని హర్సిల్‌లో పర్వతారోహణ ప్రారంభించారు. లామ్‌ఖాగా పాస్ నుంచి చిట్కూల్ చేరుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురి మృతదేహాలను అధికారులు గురువారం గుర్తించారు. ఇద్దరిని ప్రాణాలతో రక్షించారు. శుక్రవారం మరో రెండు మృతదేహాలను కనిపెట్టారు. ఇంకా ఇద్దరి జాడ తెలియాల్సి ఉంది.