టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ఎన్నికల గురించి అసలు ఆలోచిస్తున్నారో లేదో కానీ తెలంగాణ ఎన్నికలు మొత్తం 24/7 చంద్రబాబు చుట్టూనే తిరుగుతున్నాయి. ఎక్కడ ఏం జరిగినా అదంతా చంద్రబాబుకే చుట్టేస్తున్నారు. అగ్రనేతలైన హరీష్, కేటీఆర్ సహా ఆర్ఎస్ నేతలందరూ చంద్రబాబు జపమే చేస్తున్నారు. ఆయననే బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కూటమి గెలిస్తే నీళ్లు ఆగిపోతాయని, కరెంట్ రాదని ఇంకోటని చెబుతున్నారు. అవన్నీ పోను కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చేసే ఆరోపణలను, వారి చర్యలను కూడా చంద్రబాబు ఖాతాలో వేసేందుకే ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
ఇదే విషయం మీద తుచ్ఛమైన అధికారం కోసం, నాలుగు సీట్ల కోసం, ఆయనిచ్చే నోట్ల కోసం చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ దాసోహమంటోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రాహుల్ గాంధీ డిసైడ్ చేయరట, చంద్రబాబు డిసైడ్ చేస్తారట, ఇంతకన్నా సిగ్గుచేటు వ్యవహారం ఇంకేమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. అంతేకాక ఈరోజున కాంగ్రెస్ పార్టీకి రచన, స్క్రీన్ ప్లే, కథ, దర్శకత్వం.. మొత్తం చంద్రబాబునాయుడే చేస్తాడట అంటూ సెటైర్లు విసిరారు. కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి చక్రాలు, బొంగరాలు, వడియాలు అన్నీ చంద్రబాబే తిప్పుతారట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక మరోపక్క గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకు హరీష్ రావు తనకు ఆర్థిక సాయం చేస్తాననన్నారని ప్రకటించిన కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి డిపాజిట్లు గల్లంతు చేస్తానని సవాల్ చేసిన హరీష్ రావు కూడా ఇప్పుడు నేరుగా ఆ ఆరోపణలకు చంద్రబాబుకు లింక్ పెడుతున్నారు.
వంటేరు ప్రతాప్ రెడ్డితో చంద్రబాబే అలా చెప్పించారంటూ హరీష్ వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. దానికి తోడు హరీష్ కూడా చంద్రబాబు ఖబడ్దార్ అనే ప్రకటనలూ చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతల తీరు చూస్తూంటే కలలో కూడా వాళ్లు చంద్రబాబును కలవరిస్తున్నారని.. టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. నిజమే మరి జాతీయ కూటముమితో పాటు జిల్లాల్లో టీడీపీ పరిస్థితిని బేరీజు వేసుకుని అభ్యర్థులను రెడీ చేసుకునే ప్రయత్నంలో చంద్రబాబు తీరిక లేకుండా ఉన్నారు. ఇలాంటి సమయంలో కూడా టీఅరెస్ నేతలు ఆయననే టార్గెట్ చేసుకు కూర్చోవడం చూస్తుంటే వారంతా బాబు జపం చేస్తున్నట్టే ఉంది.