తెలంగాణలో ముందస్తు ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో ప్రచారాలు, మేనిఫెస్టోలు, అభ్యర్థుల ఎంపిక వడపోతలతో పార్టీలన్నీ బిజీ, బిజీగా ఉన్నాయి. అయితే అసెంబ్లీ రద్దైన రోజే అభ్యర్థుల్ని ప్రకటించిన టీఆర్ఎస్‌కు రెబల్స్ బెడద పెరిగిపోతోంది. టిక్కెట్ వస్తుందని భావించి చివరికి నిరాశ చెందిన నేతలు.. పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు కారు దిగి హస్తం పంచన చేరగా మరికొందరు అదే బాటలో ఉన్నారు. తాజాగా గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు ఎమ్మెల్సీ రాములు నాయక్. రాములు నాయక్ టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఆయన తన రాజకీయ భవిష్యత్‌పై ప్రకటన చేయబోతున్నారట.
ఈ లోపే రాములు నాయక్‌కు షాక్ ఇస్తూ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వేటు వేస్తున్నట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రకటించారు. రాములు నాయక్ నారాయణ ఖేడ్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారట. కాని గులాబీ బాస్ ఆ టిక్కెట్‌ను మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చారు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాములు ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాను కూడా కలిసినట్లు ప్రచారం జరిగింది. అందుకే టీఆర్ఎస్ ఆయన్ను తమ పార్టీ నుండి సస్పెండ్ చేసింది.