టీఆర్ఎస్‌కు బాగా దొరికిన బాబు.!

TRS Party Comments On Chandrababu In Rahul Gandhi Meet

సుధీర్ఘ ప్రత్యేక రాష్ట్రపోరాటం తర్వాత ప్రజలిచ్చిన ఐదేళ్ల అధికారాన్నీ కాలదన్ని కోయిలముందే కూసిందన్నట్టు ఎన్నికలకు బయల్దేరారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే, తమ పార్టీ ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తోందన్న విషయంలో ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగే పరిస్థితిలో లేని సీఎం సహా టీఆర్ఎస్ పార్టీ నేతలు కుంటిసాకులు చెబుతున్నారు. విపక్షాల పోరు పడలేకే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామంటూ సాక్షాత్తూ కేసీఆర్ వంటి వ్యక్తే చెబుతుండటం తెలంగాణ ప్రజలకు ఏమాత్రం అర్థంకాకుండా ఉంది. టీఅసెంబ్లీలో సంఖ్యాపరంగా పూర్తి స్థాయి మెజార్టీ ఉండి.. శాసనసభలో ప్రతిపక్షాల్ని తన పదునైన మాటల తూటాలతో చీల్చిచెండాడగల కేసీఆర్… విపక్షాల పోరుపడలేక తన ప్రభుత్వాన్ని రద్దుచేసుకునేంత పిరికివాడా? అంతటి అసమర్థుడా? 15 ఏళ్లపాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపి, ప్రాణాలకు తెగించిమరీ తెలంగాణ సంపాదించానని చెప్పుకునే కేసీఆర్, ఇంతటి సుధీర్ఘ ప్రస్థానం తర్వాత తెలంగాణ ప్రజలకు దక్కిన స్వయం పాలన అధికారాన్ని మరెందుకు ఏడాది ముందే వదులుకుంటారు? మరో ఏడాది కాలాన్ని ప్రజలకు యుద్ధప్రాతిపదికన సేవచేసేందుకు వాడుకుని జనంలోకి వెళ్తే ఇప్పుడు ఓటేసే ప్రజలకు అప్పుడెందుకు తిరస్కరిస్తారు అనేది తెలంగాణ బిడ్డలకు వేయిమిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

KCR

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో చేకూరిన లాభాలు.. తమ సర్కారు తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో విపక్షాలకు అడ్డంగా దొరికేయకుండానే ఇంతకాలం పాలన సాగించుకుంటూ వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఈ అగత్యం ఎందుకు పట్టింది? ఈ ఎపిసోడ్ మొత్తంలో ఏదో మతలబు ఉందన్న సందేహం సామాన్యప్రజల్లో మొదలైంది. అయితే, సీఎం కేసీఆర్, ఇతర టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన వచ్చిన మర్మాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పడంలేదు. లోక్‌సభ ఎన్నికలతో కలిపి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, పొత్తుల ఎత్తుల్లో భాగంగా తమ పార్టీకి ఎంతోకంత నష్టం జరుగుతోందనే వెళ్లాల్సివస్తోందన్న అసలు సంగతిని నిర్భయంగా ప్రజలకు చెప్పేందుకు సిద్దంగా లేరు కేసీఆర్. ఈ కిటుకు, ఎత్తు తెలంగాణ ప్రజలకు చెప్పకుండా దాచేయడంతో గులాబీదళం ఇస్తోన్న వివరణ తెలంగాణ సమాజానికి అతక్కుండా తయారైంది. గులాబీ బ్యాచ్ ముందస్తుకు వెళ్లడంలోని మార్మాన్ని చెప్పకుండా ఏదో బూడుబుఠానీ చేస్తున్నారన్న సందేహం తెలంగాణ ప్రజలందరిలోనూ నెలకొనే స్థితి వచ్చిపడింది. ఫలితంగా టీసర్కారు ఈ నాలుగేళ్లలో తీసుకొచ్చిన మంచిపనులు మరుగున పడే ప్రమాదం తలెత్తింది. ఈ పరిస్థితుల్లో ప్రచారం నిర్వహిస్తోన్న టీఆర్ఎస్ నేతలు ప్రచార వేదికలమీద కొంత ఇబ్బందికర పరిస్థితిలు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. సాక్షాత్తూ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత సహా కీలకనేతలంతా ఈ ఇబ్బందిని దాటేందుకు ముసుగురాజకీయం చేయాల్సిన పరిస్థితి దాపురించింది.

TRS Party

దీంతో.. ఇప్పటివరకూ ఇదే అంశం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా తెలంగాణలోని ఇతర విపక్షాలకు ముఖ్యాస్త్రం అయింది. ముందుస్తు ఎన్నికలకు వెళ్తున్న విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తూ టీకాంగీలు.. టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కారు ఈ నాలుగేళ్లకాలంలో చేసిన అభివృద్ధి, తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలను తుంగలో తొక్కే అవకాశం ఇంతకంటే మరోటి లేదన్నరీతిలో రెచ్చిపోతున్నారు. దీంతో ఎలా విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టాలా అని ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ పార్టీకి మహాకూటమి రూపంలో చంద్రబాబు కనిపించారు. నిజంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఏమీ అనలేని పరిస్థితిలో తెలుగుదేశంపై విరుచుకుపడుతూ కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కవిత వంటి టీఆర్ఎస్ స్టార్లు. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను కట్టనిస్తారా అంటూ ద్వజమెత్తుతున్నారు. అయితే, ఈ ఎత్తుకూడా అనుకున్నంత ప్రయోజనం ఇచ్చినట్టు కనిపించలేదు. తాజాగా రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ మాత్రం టీఆర్ఎస్ నేతలకు బాగా కలిసొచ్చేలా కనిపిస్తోంది.

cm-eith-rahulgandi

చంద్రబాబు చేసిన పాత ట్వీట్ల స్క్రీన్ షాట్లు, పాత వార్తాసంచికల్లో ఆయన కాంగ్రెస్‌ను తిట్టుకాకుండా తిట్టిన తిట్లపురాణం, సాక్షాత్తూ ఆయన కాంగ్రెస్ పై ఎదురుదాడిచేస్తూ చేసిన ప్రసంగాలు బయటపెట్టి.. తమ నోటికి పనిచెప్పనక్కర్లేకుండానే ఏకేస్తున్నారు. భవిష్యత్ లోనూ ఇదే బ్రహ్మాస్త్రంగా చేసుకుని మహాకూటమిపైనా, కాంగ్రెస్ పార్టీపైనా విరుచుకుపడాలని కేసీఆర్ పార్టీనేతలకు తాజా వ్యూహంగా దిశానిర్ధేశం చేశారట. మహాకూటమి అధికారంలోకి వస్తే సాగు, తాగు నీటి ప్రాజక్టుల విషయంలో చంద్రబాబు కచ్చితంగా అడ్డుకట్టవేస్తారని, ఫలితంగా తెలంగాణకు తీరని నష్టం జరుగుతందని, ప్రత్యేక తెలంగాణ వచ్చిన ఫలితం ప్రజలకు దక్కదనే విషయంతోపాటు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును చంద్రబాబు అడ్డుకున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాలని పార్టీ కోర్ క్యాడర్ దగ్గర కేసీఆర్ అన్నట్టు సమాచారం. తాజా పరిస్థితులు చూస్తుంటే, మొత్తానికి చంద్రబాబు టీఆర్ఎస్‌కు బాగానే దొరికినట్టుంది.