తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 88 స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో మంత్రుల్ని కూడా ప్రమాణం చేయించకుండా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఆయన యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ కార్యకలాపాలకు వీలుగా ఢిల్లీలో పార్టీ ఆఫీసును ప్రారంభించాలని టీఆర్ఎస్ అధినేత నిర్ణయించారు.
ఈ మేరకు పార్టీ కార్యాలయం నిర్మాణానికి అనువైన స్థలం కోసం ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ స్థలాలను పరిశీలించనున్నారు. ఎంపీలతో పాటు ప్రముఖ వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ కూడా వెళ్లనున్నారు. అయితే ఎంపీలు స్థలాలను పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం కేసీఆర్ అందులో ఒక స్థలాన్ని ఎంపిక చేయనున్నారు. కాగా, టీఆర్ఎస్ కార్యాలయం కోసం అక్కడి ప్రభుత్వం 1000 గజాల స్థలం కేటాయించడానికి అంగీకరించినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత శంకుస్థాపన చేసి రెండు మూడు నెలల్లోనే కార్యాలయాన్ని పూర్తి చేయనున్నారు.