తిరుమల శ్రీ వారి భక్తులకు అలర్ట్. రేపు తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు. దీపావళి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం దీపావళి ఆస్థానాన్ని టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించనున్నది. ఈ సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇదే రోజు శ్రీవారి ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం మినహా బ్రేక్ దర్శనం రద్దు చేశారు.
టిటిడి శనివారం బ్రేక్ దర్శనం సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని పేర్కొన్నది. కాగా, తిరుమల శ్రీవారి ద్వార దర్శనం కోసం టికెట్లను ఆన్లైన్లో ఉంచిన 21 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకోవడం విశేషం. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనానికి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవారి దర్శనం, గదులకోట టికెట్లను శుక్రవారం ఆన్లైన్ లో టీటీడీ విడుదల చేసింది. 2.25 లక్షల రూ. 300 దర్శన టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేయగ కేవలం 21 నిమిషాల్లోనే పూర్తయ్యాయి. వీటి ద్వారా టీటీడీకి రూ. 6.5 కోట్ల ఆదాయం సమకూరింది.