గత కొద్ది రోజులుగా టీటీడీపై శ్రీవారి ఆలయం మాజీ అర్చకుడు రమణదీక్షితులు తీవ్ర ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. శ్రీవారి విలువైన ఆభరణాలలో కొన్ని కనిపించకుండా పోయాయని, వాటిని విదేశాలాకు తరలించారంటూ ఆయన ఆరోపించారు. రమణదీక్షితుల ఆరోపణలపై టీటీడీ ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు శ్రీవారి ఆభరణాలను మీడియా ముందు ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ టీటీడీ ప్రకటించింది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. స్వామివారి ఆభరణాలను జూన్ 28 న మీడియా ముందు ప్రదర్శిస్తామని తెలిపారు. శ్రీవారికి చెందిన కొన్ని నగలు మాయమైనట్టు రమణదీక్షితులు చేస్తోన్న ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన, ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని స్పష్టం చేశారు.