Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒక రంగంలో సక్సెస్ అయిన వాళ్ళు రెండో రంగంలోకి విస్తరించడం కొత్తేమీ కాదు. 2019 ఎన్నికల దృష్టితో నష్టాలు వస్తాయని తెలిసినా కొత్త పత్రికలు, ఛానెల్స్ పెట్టడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు. వీరిలో ఎక్కువమంది మీడియా రంగంలోకి కొత్తగా వస్తున్న వాళ్ళే. మీడియా రంగంలో కష్టాలు తెలుసు కాబట్టి ఇప్పటికే వివిధ ఛానెల్స్ నిర్వహిస్తున్నవాళ్ళు ఇదే అదనుగా వేరే వాళ్ళ భుజాల మీదకి తమ బరువు పెట్టేస్తున్నారు. అంటే …తమ ఛానెల్స్ లో కొత్త వారిని భాగస్వాములుగా చేర్చుకోవడమో లేక అమ్ముకోవడమో మీద దృష్టి పెడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే టీవీ 9 తో వివిధ భాషల్లో నాలుగు న్యూస్ ఛానెల్స్ తో పాటు తొలివెలుగు వెబ్ సైట్ , ఐ నాక్స్ యు ట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్న రవిప్రకాష్ ఆధ్వర్యంలో ఓ సరికొత్త న్యూస్ పేపర్ తేవడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ప్రింట్ మీడియా పెద్ద లాభదాయకం కానప్పటికీ తెలుగులో కొంత వెసులుబాటు ఉందని భావించడానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న పరిణామాలే కారణం. ఇక్కడ ప్రతి దినపత్రిక ఏదో రకంగా రాజకీయ పార్టీలకి అనుగుణంగానో, వ్యతిరేకంగానో ఉంటున్నాయి. రాజకీయాలకి, మీడియా కి అవినాభావ సంబంధం ఏర్పడడంతో విశ్వసనీయత లేకుండా పోయింది. ఈ ప్రభావానికి దూరంగా నిష్పాక్షిక వార్తలతో కూడిన దినపత్రిక వస్తే ప్రజలు ఆదరిస్తారని రవిప్రకాష్ అనుకుంటున్నారట. అందుకే దానికి తగ్గట్టు పత్రిక ఏర్పాటు మీద ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి వెలుగు అని పేరు పెడతారట. మొత్తానికి మీడియా సంస్థల మూతకి ఎన్నికల ఏడాది బ్రేక్ వేసినట్టే కనిపిస్తోంది. మరికొన్ని కొత్త సంస్థలు కూడా పుట్టుకురావడంతో జర్నలిస్టులు హ్యాపీగా వున్నారు.