Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ ప్రముఖ హీరో సూర్య సినిమాల్లోకి ప్రవేశించి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సూర్య ట్విట్టర్ ద్వారా అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో వచ్చిన విజయాలు అభిమానుల వల్లే సాధ్యమయ్యాయని సూర్య తెలిపారు. అభిమానుల ప్రశంసలు మరిన్ని విజయాలను అందుకునేలా ప్రోత్సహించాయని, విమర్శలు తప్పుల్ని సరిదిద్దుకుంటూ మరింత నేర్చుకునేందుకు తోడ్పడ్డాయని సూర్య అన్నారు.
అభిమానుల మద్దతుతోనే ఆగరం ఫౌండేషన్ ను స్థాపించగలిగానన్న సూర్య మున్ముందు మరింత సాధించాలని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. శివకుమార్ కొడుకుగా సినిమాలకు పరిచయమైన సూర్య కొద్దికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. గజిని, ఆరు, యువ, సింగం వంటి చిత్రాలు సూర్యకు తమిళంలో ప్రత్యేక ఇమేజ్ తెచ్చిపెట్టాయి. తమిళంతో పాటుగా తెలుగులోనూ సూర్యకు ఆదరణ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపుగా తెలుగులో డబ్ అవుతుంటాయి.
తెలుగులో కూడా సూర్యకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. నటనకే పరిమితం కాకుండా నిర్మాణ రంగంలోనూ ప్రవేశించారు. ఆగరం ఫౌండేషన్ ద్వారా సేవాకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తనతో పాటు కొన్ని సినిమాల్లో కలిసి నటించిన హీరోయిన్ జ్యోతికను సూర్య వివాహం చేసుకున్నారు. వారికిప్పుడు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం సూర్య థాన సెరంద కూటం అనే చిత్రంలో నటిస్తున్నారు. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది.
మరిన్ని వార్తలు: