విశాఖలో సంచలనం రేపిన మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నేత విజయా రెడ్డి హత్యకేసుని పోలీసులు చేధించారు. డబ్బు కోసమే ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో నిందితులైన హేమంత్, రాధికల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ప్లాట్ కొనుగోలు చేస్తామంటూ కొద్దిరోజులుగా నమ్మించి పక్కా ప్లాన్ ప్రకారం విజయారెడ్డిని హత్యచేసినట్లు తేలింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం నగరంలోని తగరపువలసకు చెందిన హేమంత్ అలకనంద రియల్ ఎస్టేట్స్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడు కొద్దిరోజులుగా విజయారెడ్డి ప్లాట్ కొంటానని చెబుతూ ఇంటికి వస్తున్నాడు. గత నెల 26న కూడా రాధిక అనే మహిళను తీసుకొని విజయారెడ్డి ప్లాట్‌కు వెళ్లాడు. రాధికను కస్టమర్‌గా పరిచయం చేసి ఫ్లాట్ డాక్యుమెంట్లు తీసుకురమ్మని ఆమెకు చెప్పాడు. ఆమె ఇంట్లోకి వెళ్లగానే వెంబడించి బలమైన ఆయుధంతో తలపై గట్టిగా మోదాడు.
రక్తపుమడుగులో పడిపోగానే ఆమె మీద అత్యాచారానికి ప్రయత్నించాడు. విజయారెడ్డి ప్రతిఘటించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో నరికి చంపేశాడు. విజయారెడ్డి మృతదేహాన్ని తీసుకెళ్లి బాత్రూమ్లో పడేశాడు. తర్వాత తాపీగా స్నానం చేసి విజయారెడ్డి భర్త బట్టలు వేసుకుని ఆమె మెడలో బంగారపు ఆభరణాలు, కప్ బోర్డులో నగలు, డబ్బును తీసుకున్నాడు. అక్కడి నుంచి విజయారెడ్డి కారును తీసుకొని రాధికతో కలిసి పారిపోయాడు. మరుసటి రోజు చోరీ చేసిన నగల్ని నగరంలోని ఓ జ్యువెలరీ షాపులో టోకు రేటుకు అమ్మేసిన హేమంత్ రాధికతో కలిసి విజయవాడ వెళ్లాడు. విజయారెడ్డి భర్తతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ తన మీద అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ హత్యకేసులో పోలీసుల అనుమానాలు నిజమయ్యాయి.
మొదటి నుంచి హేమంత్ తీరును గమనించిన పోలీసులు అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌తో పాటూ పలువుర్ని ప్రశ్నించారు. హేమంత్ ఈ హత్య చేశాడని దాదాపు నిర్థారణకు వచ్చిన పోలీసులు స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించి నిందితుడ్ని పట్టుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా ముందు బుకాయించినా నేరం తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. విజయా రెడ్డి కారును తీసుకెళ్లిన హేమంత్ ఆమె ఫోన్ ను కూడా ఎత్తు కెళ్లాడు. ఆ ఫోన్ ఆధారంగా అతడ్ని పోలీసులు పట్టుకున్నారు. రాధిక, హేమంత్ లు అలకనంద రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగులు కాగా ఇద్దరి మధ్య కొద్దిరోజులుగా వివాహేతర సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు.