తండ్రి భ‌య‌ప‌డిన‌ట్టే జ‌రిగింది… ఉగ్ర‌వాదానికి బ‌లైపోయిన కొడుకు

Two militants killed in Anantnag encounter
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కొడుకును జ‌న‌జీవన స్ర‌వంతిలోకి తీసుకురావాల‌న్న ఆ తండ్రి ఆశ నెర‌వేర‌లేదు. దారి త‌ప్పిన కుమారుడిని మ‌ళ్లీ చేయిప‌ట్టుకు న‌డిపించి స‌రైన మార్గం చూపించాల‌ని క‌న్న క‌ల‌లు ఆవిర‌య్యాయి. కొడుకు బాగున్నాడ‌ని, బాగుంటాడ‌ని పెట్టుకున్న న‌మ్మ‌కం క‌రిగిపోయింది. కొడుకు ఆలోచ‌న లేకుండా బ‌త‌క‌లేన‌నుకున్న తండ్రికి… అస‌లు కొడుకే లేకుండా పోయాడు. ద‌క్షిణ కాశ్మీర్ లోని అనంత నాగ్ జిల్లాలో భ‌ద్ర‌తాద‌ళాల‌కు, మిలిటెంట్ల‌కు మ‌ధ్య జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ లో చ‌నిపోయిన 18 ఏళ్ల ఫ‌ర్హాన్ వ‌నీ తండ్రి గులాం ఆవేద‌న ఇది. కుల్గామ్ జిల్లాలోని ఖుద్వానీ గ్రామానికి చెందిన ఫ‌ర్హాన్ వ‌నీ గ‌త ఏడాది మ‌ధ్య‌లో ఉగ్ర‌వాదుల్లో క‌లిసిపోయాడు. గ‌త నవంబ‌ర్ లో ఫ‌ర్హాన్ తండ్రి ఫేస్ బుక్ లో కొడుకును ఉద్దేశించి భావోద్వేగ‌మైన పోస్టు పెట్టాడు. హింస‌ను విడ‌నాడి… ఇంటికి తిరిగి రా అంటూ హృద‌యాన్ని క‌దిలించివేసే రీతిలో విజ్ఞ‌ప్తిచేశాడు.

Two militants killed in Anantnag encounter

ఉగ్ర‌వాదుల్లో చేరిన ఫుట్ బాల‌ర్ మ‌జిద్ ఖాన్ త‌న త‌ల్లిదండ్రులు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు చూసి… తిరిగి వ‌చ్చిన నేప‌థ్యంలో గులాం కూడా ఇదే ఆశ‌తో పోస్టుపెట్టాడు. బిడ్డా… నువ్వు మమ్మ‌ల్ని విడిచి వెళ్లిన నాటినుంచి నా శ‌రీరం నా మాట విన‌డంలేదు. నువ్వు చేసిన‌దానికి బాధ‌తో నేను అల్లాడిపోతున్నాను. అయినా నువ్వు ఇంటికి తిరిగి వ‌స్తున్న న‌మ్మ‌కం నాలో ఉంది. చిరున‌వ్వుతో కూడిన నీ ముఖాన్ని నేనెంత‌గా మిస్ అవుతున్నానో వివ‌రించ‌లేను. నువ్వు వెళ్లి ఆరు నెల‌లు అవుతోంది. నీ ఆలోచ‌న లేకుండా ఒక్క నిమిషం కూడా నాకు గ‌డవ‌డం లేదు. నువ్వు బాగున్నావ‌ని, బాగుంటావ‌ని ఆశ‌తో బ‌తుకుతున్నాను.

నేను నీ తండ్రిని. నేను కాక‌పోతే నీకు ఈ విష‌యం ఎవ‌రు చెప్తారు? నేను చ‌నిపోతానేమో అనిపిస్తోంది. నాకు మ‌రో మార్గం లేదు. నీకు నేను చాలా చెప్పాల్సి ఉంది. ఎంతో నేర్పించాల్సి ఉంది. తిడుతూ నీకు సాయం చేయాల్సి ఉంది. నీ తల్లి కూడా నీకోసం ఎంతో త‌పించిపోతోంది. నువ్వు ఎంచుకున్న మార్గాన్ని వ‌దిలి ఇంటికి తిరిగి రావాల‌ని, గ‌డిచిందంతా మ‌ర్చిపోవాల‌ని, నువ్వు ఎంచుకున్న మార్గం వ‌ల్ల నువ్వు శాశ్వ‌తంగా దూర‌మ‌య్యే అవ‌కాశం కూడా ఉంద‌ని, కాబ‌ట్టి త్వ‌ర‌గా ఇంటికి రావాల‌ని వేడుకుంటూ న‌వంబ‌ర్ 24న ఆవేద‌నా భ‌రితంగా ఫ‌ర్హాన్ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. అయితే తండ్రి రాసిన లేఖ ఫ‌ర్హాన్ మ‌న‌సును క‌రిగించ‌లేదు. త‌న మార్గాన్ని వ‌ద‌లని ఫ‌ర్హాన్ చివ‌రకు తండ్రి భ‌య‌ప‌డిన‌ట్టే ఎన్ కౌంట‌ర్లో హ‌త‌మై అంతులేని ఆవేద‌న‌ను మిగిల్చాడు.