Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అండర్ -19 భారత జట్టు చరిత్ర సృష్టించింది. నాలుగోసారి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ మంజోత్ కల్రా భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. సెంచరీతో చెలరేగాడు. 101 పరుగులుతో నాటౌట్ గా నిలిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి 47.2 ఓవర్లలో 216 పరుగులకే కుప్పకూలింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత కుర్రాళ్లు ప్రారంభం నుంచే ధాటిగా ఆడారు. కెప్టెన్ పృథ్వీ షాతో కలిసి బ్యాటింగ్ ఆరంభించిన మంజోత్ కల్రా చివరిదాకా ధాటిగా ఆడాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ ఔటయిన తర్వాత శుభ్ మన్ గిల్ తో జతకట్టిన మంజోత్ వేగంపెంచాడు. వారిద్దరూ కలిసి 47 బంతుల్లో 50 పరుగులు చేశారు. అయితే 22వ ఓవర్లో 131 పరుగుల వద్ద శుభ్ మన్ గిల్ ఔటయ్యాడు.
అనంతరం వికెట్ కోల్పోకుండానే భారత్ లక్ష్యాన్ని సాధించింది. సెంచరీ చేసిన మంజోత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన శుభ్ మన్ గిల్ కు మ్యాన్ ఆఫ్ ది టోర్నీ దక్కింది. గతంలో 2000, 2008,2012ల్లో అండర్ -19 వరల్డ్ కప్ గెలుచుకున్నప్పటికీ ఈ వరల్డ్ కప్ భారత్ కు ప్రత్యేకమయినది. టోర్నీలో ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా భారత్ కప్ కైవసం చేసుకుంది. అలాగే టోర్నీ అంతా యువ ఆటగాళ్లు నిలకడగా రాణిస్తూ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. సీనియర్లకు ఏమాత్రం తగ్గకుండా ఫీల్డింగ్ చేశారు.
ఐపీఎల్ వేలంలో అండర్ -19 వరల్డ్ కప్ ఆటగాళ్లు ఏడుగురు అమ్ముడుపోవడం, వారిలో నలుగురికి కోట్లలో ధర పలకడం చూస్తే వారి ఆటతీరు ఏ విధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. అటు భారత్ కు అద్వితీయ గెలుపు సాధించిపెట్టిన కోచ్ రాహుల్ ద్రావిడ్ పై ప్రశంసలవర్షం కురుస్తోంది. రాహుల్ వల్లే ఈ గెలుపు సాధ్యమైందని మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. కొత్త రికార్డు నెలకొల్పిన జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. కోచ్ రాహుల్ ద్రావిడ్ కు రూ. 50లక్షలు, జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 30లక్షలు నజరానా అందించనుంది.