Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యూపీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దినేశ్ శర్మ విచిత్ర వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. జర్నలిజం, ప్రత్యక్షప్రసారాలు మహాభారత కాలంలోనే ఉన్నాయని నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దినేశ్ శర్మ ఇవాళ కూడా అదే తరహా అభిప్రాయం వ్యక్తంచేశారు. టెస్ట్ ట్యూబ్ బేబీలు రామాయణ కాలంలోనే ప్రారంభమయ్యాయని చెప్పుకొచ్చారు. సీతమ్మ మట్టికుండలో జన్మించారని పెద్దలు అంటుంటారని, అందుకే టెస్ట్ ట్యూబ్ బేబీల కాలం అప్పటినుంచే ప్రారంభమైనట్టు భావించాలని దినేశ్ శర్మ సెలవిచ్చారు. మహాపతివ్రతగా, ఆదర్శ ఇల్లాలుగా అందరూ భావించే సీతాదేవి… తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నది దినేశ్ శర్మ విశ్లేషణ.
గురువారం ఆయన మాట్లాడుతూ సంజయుడు హస్తినాపురంలోనే ఉండి కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం గురించి ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడికి వివరించాడని, ఇది లైవ్ టెలికాస్టేనని, నారదముని ఆ కాలంలోనే సమాచారాన్ని చేరవేయడంలో సిద్ధహస్తుడని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఆయన వాదనను సమర్థించగా, మరికొంత మంది సెటైర్లు వేశారు. ఎన్ని విమర్శలు వ్యక్తమయినా దినేశ్ శర్మ మాత్రం వెనక్కి తగ్గలేదు. నిన్న మహాభారతాన్ని, ఇవాళ రామాయణాన్ని ఉదాహరణలుగా చూపుతూ భారత్ లో టెక్నాలజీ ఎప్పటినుంచో ఉందని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.