ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్‌లో పర్యటించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సిద్ధమయ్యారు. బుధవారం రోజున ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నట్లు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. ఆ దేశానికి మద్దతు తెలిపిందేకు బైడెన్ అక్కడికి వెళ్లనున్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహూతో సమావేశమై.. గాజాకు మానవతా సాయంపై బైడెన్ చర్చలు జరుపుతారని వెల్లడించారు. ఇరు దేశాలు గాజాకు సాయం చేసే విషయంలో ఓ ప్రణాళికను రూపొందించడానికి అంగీకరించినట్లు ప్రకటించారు.
“నేను బుధవారం ఇజ్రాయెల్ వెళ్తున్నాను. హమాస్ ఉగ్రవాదుల ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలుస్తాం. మానవతా సాయం అందించే విషయమై అధికారులతో చర్చిస్తాను. పాలస్తీనియన్ల స్వయం నిర్ణయాధికారం కోసం హమాస్ నిలబడదు.” అని బైడెన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.