Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోనుంది. విజయవాడ కాపు రాజకీయాలకు కేంద్రబిందువుగా ఉన్న వంగవీటి రాధ వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారన్న వార్తలు ఆ రెండు పార్టీల్లో కలకలం రేపాయి. వైసీపీ నేతలు టీడీపీకి వలసకట్టడం ఏపీ రాజకీయాల్లో తరచుగా జరుగుతున్న పరిణామమే కానీ..రాధ పార్టీ మారడం, అందులోనూ టీడీపీలో చేరడం సాధారణ విషయం కాదు. బెజవాడ రాజకీయాలను మలుపు తిప్పిన రాధ తండ్రి వంగవీటి రంగా తన రాజకీయ జీవితం అంతా టీడీపీకి వ్యతిరేకంగా పోరాడారు. రాధ కూడా కాంగ్రెస్ నుంచే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. కాంగ్రెస్ రాష్ట్రంలో బలహీన పడి వైసీపీ టీడీపీకి రాజకీయ ప్రత్యర్థిగా మారాక రాధ కూడా కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు.
రాధ నేపథ్యం, విజయవాడ రాజకీయ పరిస్థితులు ఆయన్ను టీడీపీకి దూరంగానే ఉంచుతాయి. అందుకే తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రాధ కూడా ఇప్పటిదాకా టీడీపీని ప్రత్యర్థిపార్టీగానే చూశారు. కానీ విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితులు, వైసీపీ అంతర్గత విభేదాలు రాధను సంచలన నిర్ణయం దిశగా నడిపించాయి. నిజానికి తాజా పరిణామాలు విశ్లేషిస్తే పార్టీ మారాలన్న నిర్ణయం రాధ ఇప్పటికిప్పుడు కొత్తగా తీసుకున్నది కాదన్నది అర్ధమవుతుంది. ఓ టీవీ చానల్ ముఖాముఖిలో వైసీపీ నేత గౌతం రెడ్డి వంగవీటిరంగాపై సంచలన ఆరోపణలు చేసినప్పుడే రాధకు, వైసీపీకి మధ్య దూరం పెరిగిన సంకేతాలు వచ్చాయి. వైసీపీ అధినేత జగన్ తక్షణమే స్పందించి రాత్రికి రాత్రి గౌతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ..రాధ ఏదో కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్న భావన కలిగింది. ఆరునెలలైనా తిరగకముందే రాధ సంచలన అడుగు వేశారు. రాధ నోటి నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ..రాధ పార్టీ మార్పు ఖాయమన్న మాట అటు టీడీపీ, ఇటు వైసీపీ నుంచి వినిపిస్తోంది.
విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టికెట్ విషయంలో జగన్ వైఖరి నచ్చకే రాధ పార్టీ వీడుతున్నట్టు తెలుస్తోంది. ఆ సీటుపై రాధ ఎప్పటినుంచో ఆశతో ఉన్నారు. అయితే విష్ణు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన సమయంలో జగన్ సెంట్రల్ టికెట్ కేటాయించేందుకు హామీ ఇచ్చారు. అప్పటినుంచి రాధలో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. టీడీపీ విజయవాడ సెంట్రల్ టికెట్ హామీఇస్తే పార్టీ మారేందుకు సిద్ధమన్న సంకేతాలు పంపించారు. టీడీపీ ఇందుకు ఒప్పుకుని ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. చంద్రబాబు దావోస్ నుంచి రాగానే రాధ చేరిక ఉంటుందని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాధ చేరికతో కాపు సామాజిక వర్గంలో, ముఖ్యంగా విజయవాడలో టీడీపీ మరింతగా బలపడుతుందని భావిస్తున్నారు.