నాటి కాంగ్రెస్ నేత కాపు నాయకుడు వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణ తెలుగు దేశం పార్టీలో చేరారు. నిన్న రాత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకొని రాధా, ఆయన అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ వైఎస్ జగన్‌పై ఘాటైన విమర్శలు చేశారు. ఆయనకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. జగన్‌లో ఎప్పుడూ సీఎం కావాలనే ఆరాటం చూశానని ఆయన ఎద్దేవా చేశారు. తనను తమ్ముడు అని చెప్పిన జగన్ వెన్నుపోటు పొడిచారన్నారు. అందరితో చేతులు కలిపి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారన్నారు. ఇకనైనా మారు జగన్ రెడ్డి అంటూ వైఎస్ఆర్సీపీ అధినేతకు సూచించారు. జగన్‌కు మరోసారి ప్రతిపక్ష స్థానమేనని జోస్యం చెప్పారు. గత జనవరిలోనే రాధా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. వెంటనే ఆయన టీడీపీలో చేరతానే వార్తలొచ్చాయి. కానీ విజయవాడలో పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని ఆయన సీఎంను కోరారు. రాధా అభ్యర్థన పట్ల సీఎం సానుకూలంగా స్పందించారు. దీంతో ఎన్నికల ముందు ఆయన తెలుగు దేశం పార్టీలో చేరారు. ఇక వంగవీటి రాధ చేరికతో కృష్ణా జిల్లా టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. రాధ చేరికతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రంగా-రాధ మిత్రమండలి సభ్యులంతా తమ పార్టీకే వెన్నుదన్నుగా ఉంటారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. వైసీపీలో తనకు జరిగిన అవమానాన్ని రాధ మీడియా సాక్షిగా వెల్లడించడంతో కాపు సామాజిక జీర్ణించుకోలేకపోతోంది. తమ నేతను కాపాడుకోలేని పార్టీ ఇతర సామాజిక వర్గాలకు ఏం న్యాయం చేస్తుందన్న భావన వారిలో కనిపిస్తోంది. మరోవైపు తనను నమ్మి పార్టీలో చేరిన వంగవీటి రాధాకు సమున్నత స్థానం కల్పించాలని బాబు యోచిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన్ని మచిలీపట్నం నుంచి లోక్‌సభ బరిలో దించాలని ఆయన చూస్తున్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సుమారు 2.50లక్షల కాపు సామాజికవర్గం ఓట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి రాధా పోటీ చేస్తే పార్లమెంటు నియోజకవర్గంతో పాటు, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలపైనా సానుకూల ప్రభావం చూపుతుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే వంగవీటి రాధా మచిలీపట్నం నుంచి పోటీచేస్తే సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్న పార్టీ శ్రేణుల్లో నెలకొంది. దీంతో కొనకళ్లను పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఆయన కూడా తనకు పెడన సీటు కావాలని ఎప్పటినుంచో అధినేత చంద్రబాబును కోరుతున్నారట. ఈ కారణంగా పెడన సీటును పార్టీ పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇదే స్థానం నుండి మాజీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కి టికెట్ అనౌన్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాధాకి ఈ సీటు ఇస్తే గెలుపు ఖాయమనే చెప్పాలి, మరో విషయం ఏంటంటే రాధా మచిలీపట్నం నుండో పోటీ చేస్తే గుడివాడలో కూడా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన పార్లమెంటరీ నియోజకవర్గంలో అదీ ఒక భాగం కాబట్టి, అక్కడ ఇప్పటికే దేవినేని ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.