వైసీపీ నుంచి బయటకొస్తున్నట్టు ప్రకటించిన వంగవీటి రాధాకృష్ణ, ఇప్పటి వరకూ ఏ పార్టీలో చేరలేదు. ఆయన టీడీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగినా ఎందుకో ఆయన తొందరపడలేదు. ఒక దశలో రాధా చేరికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం టీడీపీ నేతలకు సూచనలు కూడా చేశారు. వంగవీటి రాధా మన పార్టీలోకి వస్తున్నారని, అందరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ, ఆయన మాత్రం తటస్థంగా ఉండటంతో తిరిగి వైసీపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు రాయబారాలు సాగించినట్టు దానికి ఊతం ఇచ్చేలగా ఆయన నిన్న కొడాలి నానితో చేసిన మంతనాలు హైలైట్ అయ్యాయి. సోమవారం అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి వంగవీటి రాధా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి రహస్య మంతనాలు సాగించారు. వీరి మధ్య భేటీ దాదాపు రెండు గంటల పాటు సాగినట్టు తెలుస్తోంది.
తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబుతో మాట్లాడటానికే రాధా వచ్చినట్టు సమాచారం. రాధా డిమాండ్ల పరిష్కారానికి సీఎం నుంచి స్పష్టమైన హామీ లభించిందని, నేడో రేపో అధికారింగా టీడీపీలో చేరుతారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అసెంబ్లీ సీటును కేటాయించలేమని, అనకాపల్లి లేదా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో, టీడీపీ చేరేందుకు వంగవీటి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనకాపల్లి కన్నా, విజయవాడకు దగ్గరగా ఉండే నరసరావుపేట వైపే ఆయన మొగ్గు చూపుతున్నారని రాధా సన్నిహితులు అంటున్నాయి. ఎంపీగా పోటీ చేసి, ఆపై ఫలితం తారుమారైనా రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటామని, విజయవాడకు జరిగే మునిసిపల్ ఎన్నికల్లో రాధ అనుచరులకు ప్రాతినిధ్యం కల్పిస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం.