ప్రధాని హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఏకకాలంలో ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. వారికి అనుమానాలున్నాయనే కారణంతో విరసం నేత వరవర రావుతో పాటు మరో నలుగురు పౌరహక్కుల నేతలను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయనతో సహా అరెస్ట్ చేసిన వారందరినీ పూణేకు తరలించారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర పోలీసులు విరసం నేత వరవరరావును పూణె నుంచి హైదరాబాద్‌కు తరలించారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ భద్రత నడుమ హైదరాబాద్ గాంధీనగర్‌లోని ఆయన నివాసంలో వదిలిపెట్టి వెళ్లారు. ఆయన అరెస్ట్ మీద పౌర హక్కుల సంఘం నేతలు కోర్టుకు వెళ్లడంతో హౌస్ అరెస్ట్ చేసి మాత్రమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు, పోలీసులను ఆదేశించింది. వరవరరావును ప్రస్తుతం పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే పూణెకు చెందిన నలుగురు పోలీసులు వరవరరావు ఇంటి వద్ద ప్రత్యేకంగా కాపలాగా ఉన్నారు. అలాగే తెలంగాణ పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించారు. ఆయన ఇంటి దగ్గరలోకి కూడా ఎవరినీ అనుమతించటం లేదు.