మళ్ళీ కడప మీద పడ్డ వర్మ  ?

varma-hit-on-kadapa-again

విలక్షణ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఏమి చేసినా న్యూస్ లో నిలవడం ఖాయం. అలాగే ఆయన రెండేళ్ళ క్రితం వెబ్‌ సిరీస్‌ కడప అంటూ ఒక ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఇందులో ఏ పాత్రా కల్పితం కాదు.. ప్రాణ భయం మూలంగా వారి పేర్లు. ప్రాంతాల పేర్లు మార్చి చెప్పామంటూ వర్మ వాయిస్‌ ఓవర్‌ తో వచ్చిన ఆ ట్రైలర్‌ అప్పట్లో రచ్చ రేపింది.

అయితే కాలక్రమేణా అది మరుగున పడింది. వర్మ దాని గురించి మర్చిపోయారని అనుకున్నారు అంతా. అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఆయన మళ్ళీ ఆ సిరీస్ మీద ద్రుష్టి సారించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్టింగ్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే ఈ సిరీస్ షూట్ కి వెళ్లనుందని అంటున్నారు.

ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో హిట్ కొట్టిన వర్మ శశికళ బయోపిక్ కూడా ప్రకటించారు. అయితే ఆయన అవన్నీ పక్కన పెట్టి ముందుగా ఈ సిరీస్ ను రిలీజ్ చేయాలని వర్మ భావిస్తున్నట్టు చెబుతున్నారు. రక్త చరిత్ర సమయంలో సీమ లోపలి నిజాలు పూర్తిగా తెలియకపోవడం, కొన్ని వార్నింగ్‌లు ఇచ్చి పుచ్చుకోవడం వల్ల అసలు రాయలసీమ శరీరాన్ని పూర్తిగా బట్టలిప్పదీసి చూపించలేకపోయానని

అందుకు ప్రాయశ్చిత్తంగా ఈ వెబ్ సిరీస్‌లో భయాన్ని నూతిలోకి పారేసి, ఎవడేమి అనుకున్నా, ఎవ్వడేమి ఫీలయినా లెక్క చేయకుండా నిజమైన కథని నిజంగా చూపించడానికి సైకిల్ చైన్ మీద ఒట్టేసి కంకణం కట్టుకున్నట్లు రాంగోపాల్ వర్మ పేర్కొనడం అప్పట్లో కలకలం రేపింది.

అయితే వర్మ ఈ వెబ్ సిరీస్‌లో తమ సామాజిక వర్గాన్ని దుర్మార్గులుగా చూపిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఏపీలోని రెండు సామాజిక వర్గాల వారు అప్పట్లోనే హెచ్చరించారు. చూడాలి మరి వర్మ ఏమి చేయనున్నాడో ?