వర్షాలు సమృద్ధిగా కురువాలని రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో వేదపండితులు బుధవారం గండిపేట జలాశయంలో వరుణ జపం నిర్వహించారు. చిలుకూరు ఆలయానికి చెందిన ఐదుగురు అర్చకులు.. సఫిల్గూడలోని వేదభవనం నుంచి శ్రీరామ గణపాటి శిష్య బృందంతో కలిసి వేదమంత్రోచ్ఛారణల మధ్య చేసిన వరుణ జపంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ఉదయం 10 గంటలకు స్వామివారి తీర్థ ప్రసాదాలను కలశంలో తీసుకెళ్లి జలాశయంలో కలిపి వరుణజపం ప్రారంభించారు. 108 సార్లు వరుణదేవున్ని ప్రార్థిస్తూ మంత్రాలు పఠించారు. అనంతరం జలాశయంలోని నీటిని తీసుకొచ్చి ఆలయంలోని గరుత్మంతుడికి, స్వామికి ఎదురుగా ఉన్న హనుమంతుడి పాదాలకు అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందరరాజన్, అర్చకులు సురేశ్స్వామి, సుదర్శన్స్వామి, ఇతర అర్చకులు పాల్గొన్నారు.