తూ.గో జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపులు సుబ్బారావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. కార్యకర్తల అభీష్టం మేరకు తిరిగి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు. తాను 2014లో వైసీపీ తరఫున గెలిచి కార్యకర్తల అభీష్టం మేరకు టీడీపీలోకి వస్తే తనకు టిక్కెట్టు ఇవ్వకుండా అన్యాయం చేశారని వరుపుల సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కంటతడి పెట్టుకున్నారు. ఆయనకు టిక్కెట్టు ఇవ్వకపోవడం పట్ల కార్యకర్తలు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బారావుకు బదులుగా మనవడు వరుపుల రాజాకు టికెట్ ఇస్తున్నట్లు టీడీపీ ప్రతకనతో తీవ్ర మనస్తాపానికి గురైన సుబ్బారావు పార్టీని వీడారు. తన అనుచరులతో గురువారం ప్రత్తిపాడులో సమావేశమైన ఆయన.. వారి అభీష్టం మేరకు టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన వైఎస్ఆర్ సీపీలో చేరుతారని తెలుస్తోంది. దీనికోసం ఆ పార్టీ అగ్ర నాయకత్వంతో ఇప్పటికే మంతనాలు నిర్వహించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ కుటుంబం కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక తాజా పరిణామాలు గమనిస్తే ప్రత్తిపాడులో టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.